ఓట్, సీట్ చోరీ పేటెంట్స్ కాంగ్రెస్ వే.. మోదీ కర్మయోగి: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: ఓట్ చోరీ, సీట్ చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని చెప్పారు. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పాలకులు కాంగ్రెస్ కోరిన సమయంలో దేశంలోని ప్రదేశ కాంగ్రెస్ కమిటీలన్నీ తొలి ప్రధాని అభ్యర్ధిగా పటేల్ పేరు ప్రతిపాదిస్తూ ఓట్లేస్తే..  నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీకి ఓట్, సీట్ చోరీకి పాల్పడాల్సిన కర్మ లేనేలేదని బండి సంజయ్ అన్నారు. ఆయనకు కుటంబమే లేదని, బ్యాంకు బ్యాలెన్స్, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు అవసరమే లేదని చెప్పారు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన వెంటనే జబ్బకు సంచి తగిలించుకుని సామాన్యుడిలా ప్రజా సేవలో తరించే మహనీయుడు మోదీ అని అభివర్ణించారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి హౌజింగ్ బోర్డు కాలనీ పడవ చౌరస్తా వరకు ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ వర్చువల్ గా ప్రసగించి కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

బండి సంజయ్ ఏమన్నారంటే..

“దేశం కోసం, ప్రజల కోసం 25 ఏళ్ల ప్రజా సేవను గుర్తుగా సేవా జ్యోతి నిర్వహించాం. మోదీ దేశానికి చిరకాలం సేవలందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రతి పేదింట్లో వెలుగులు నింపడం ద్వారా దేశాభివ్రుద్ధి సాధించేలా మోదీ శ్రమిస్తున్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ మాటలు విని మోసపోయిన యువకులకు నా విజ్ఞప్తి ఇదే. మోదీ రాజకీయ నేపథ్యం, చరిత్ర, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోండి. మోదీ లేని భారత్ ను ఊహించలేం. స్వార్ధం వీడి దేశం కోసం ఆలోచించండి. 2014కు ముందు… నేడు భారత్ ఏ విధంగా అభివ్రుద్ధి చెందుతుందో ఆత్మ విమర్శ చేసుకోండి.

మోదీకి సొంత కుటుంబం లేదు.. దేశ ప్రజలే ఆయన కుటుంబం. ఆయనకు డబ్బులు, బినామీ ప్రాపర్టీలు అవసరమే లేదు. దేశ సేవే ఆయన లక్ష్యం. ప్రధాని పదవి నుండి దిగిపోయినా జబ్బకు సంచి వేసుకుని ప్రజాసేవలో తరించే మహనీయుడు మోదీ. మోదీకి ఆయురారోగ్యాలు అందించాలని సేవా జ్యోతి నిర్వహించాం. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన సంస్థ. ఈసీ బీజేపీ జేబు సంస్థ కానేకాదు. ప్రజలంతా విచక్షణతో ఓట్లు వేస్తున్నారు కాబట్టే ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతోంది. రాజ్యాంగ సంస్థను బదనాం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం.

జ్ఞానేష్ కుమార్ అంశం కోర్టులో తేల్చుకోండి. రాజ్యాంగ సంస్థపై కాంగ్రెస్ దాడి దుర్మార్గం. రాహుల్ గాంధీ ఈసీని ఎప్పుడైనా కలువొచ్చు. ఈసీ అపాయిట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు? వందల మందితో దాడికి వెళితే అడ్డుకోక ఏం చేస్తారు? ఓటు చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నయ్. దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీ చేసింది కాంగ్రెస్సే. దేశంలోని పీసీసీలన్నీ తొలి ప్రధాని అభ్యర్ధిగా పటేల్ పేరు ప్రతిపాదిస్తే.. నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దే.

అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాదు, అనర్హులను ఓట్ల జాబితా నుండి తొలగించడమే సర్ లక్ష్యం. చనిపోయిన పీవీ నర్సింహారావు పేరు మొన్నటిదాకా ఓటర్ల జాబితాలో ఉంది. సర్ తో ఆ ఓటును తొలగించారు.. అది కూడా తప్పేనా? 2.8 కోట్ల మంది చనిపోయారు. ఆ ఓట్లన్నీ తీసేయాలని కాంగ్రెస్సే చెప్పింది. తెలంగాణలోనే 70 లక్షల దొంగ ఓట్లున్నాయని అభిషేక్ సింఘ్వీ చెప్పారు కదా. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల దొంగ ఓట్లున్నాయి. రాజస్థాన్‌లో 45 లక్షల డూప్లికేట్ ఓట్లున్నాయని సచిన్ పైలట్ చెప్పారు కదా? కేరళంలో సర్ ప్రక్రియ పకడ్బందీగా అమలు చేయడంవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రమేశ్ చెన్నితల ప్రకటించారు కదా?

తెలంగాణలో 2014కు ముందు లక్షలాది మంది రోహింగ్యాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులున్నారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకుపైగా రోహింగ్యాల ఓట్లున్నాయి. ఎన్నికల సంఘానికి, బీజేపీకి ఏం సంబంధం? సీఈసీ తప్పు చేస్తే సుప్రీంకోర్టులో తేల్చుకోండి. మీ స్వార్ధం కోసం రాజ్యాంగ సంస్థలపై బురద చల్లుతారా?.మరి ఆ ఓట్లన్నీ తొలగించాలా? వద్దా.

కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా. చర్యలు తీసుకోవాలనే సోయి కాంగ్రెస్ కు లేనేలేదు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్ కు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయి. కేసీఆర్ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా. నాకు బీజేపీ ఎన్నో పదవులిచ్చింది. ఎన్నో అవకాశాలిచ్చింది. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శిరసావహిస్తా. కార్యకర్తగా పార్టీ కోసం చేస్తా.” అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>