కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (MG University) పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ల బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణతోపాటు సమర్థవంతమైన పరీక్షల నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను పాటించడమే నాణ్యమైన విద్యా విధానానికి తొలి అడుగు అని అభివర్ణించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమమైన ఉపాధ్యాయులుగా రాణించాలని ఆకాంక్షించారు.
పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి ఫలితాల వివరాలను వెల్లడించారు. మొదటి సెమిస్టర్‌లో మొత్తం 760 మంది విద్యార్థులు హాజరుకాగా 59.87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సెమిస్టర్‌లో 3,057 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 81.32శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మూడవ సెమిస్టర్‌లో 267 మంది విద్యార్థులకు గాను 76.78శాతం ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్‌లో 2,798 మంది విద్యార్థులు హాజరుకాగా అత్యధికంగా 95.21శాతం సాధించి సత్తా చాటారు.
పూర్తి ఫలితాల కోసం విద్యార్థులు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (MG University) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, అధ్యాపకులు, అధికారులు డాక్టర్ జి. లక్ష్మీప్రభ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ కళ్యాణి పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హరీశ్‌రావు కంచుకోటను బద్దలు కొట్టేనా?
Follow Us On: Instagram

