కలం, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్‌రెడ్డి రంగారెడ్డి అక్టోబర్ 6న టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇబ్రహీంపట్నం నుంచి యంజాల్ వైపు వెళ్తూ బస్సులో ఉన్న మహిళలు, యువతులతో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం పట్ల వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఓ యువతిని తాకుతున్నట్లుగా సదరు వీడియో ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విరివిగా పోస్టు చేశారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
చిన్మయి ఫైర్..
మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే సింగర్ చిన్మయి (Chinmayi) కూడా ఈ ఘటనపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దేవతలుగా కీర్తిస్తూనే మరోవైపు కనీస హద్దులు పాటించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ నాయకులకు ముందుగా నేర్పించాలని హితవు పలికారు. సాధారణ సంభాషణల కోసం కూడా పదే పదే బాలికను తాకాల్సిన అవసరం లేదని, ఆమె అసౌకర్యంగా ఫీల్ అయ్యి, పక్కకు జరుగుతున్నా సదరు వ్యక్తి ఆమె నడుము భాగంలో చేతులు వేసి, ఆపడానికి ప్రయత్నించిన స్నేహితురాలి చేయిని కూడా పట్టుకున్నారని తన పోస్టులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..
మరోవైపు ఈ ఘటనపై మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) కూడా స్పందించారు. ఆయనపై కావాలనే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బస్సులో ప్రయాణించిన మామూలు వీడియోను పట్టుకొని తమకు అనుకూలంగా మార్చుకోని సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకు మహిళలు అంటే ఎంతో గౌరవమని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.
Also Read : తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. దసరాకు ప్రత్యేక బస్సులు
Follow Us On : WhatsApp

