కలం, కరీంనగర్: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వీటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సౌజన్యంతో రూపొందించిన ‘Pause for Safety’ (ఆగండి. ఆలోచించండి. సరిచూసుకోండి) అవగాహన పోస్టర్‌ను కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రధానంగా జరుగుతున్న సైబర్ మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ముఖ్య సూచనలు..
* బిజినెస్ ఫ్రాడ్ (Business Fraud): నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ పర్చేజ్ ఆర్డర్లతో వ్యాపారులను మోసం చేసే ముఠాలు ఉన్నాయి. చెల్లింపులు చేసేముందు వెండర్ వివరాలు, బ్యాంక్ ఖాతాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలి.
* పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్ (Part Time Job Fraud): వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో తక్కువ శ్రమకు ఎక్కువ డబ్బులు వస్తాయంటూ వచ్చే ఆఫర్లను నమ్మవద్దు. అసలైన సంస్థలు ముందస్తుగా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు అడగవు.
* ఫేక్ లోన్ యాప్స్ (Loan App Fraud): తక్షణమే రుణాలు ఇస్తామంటూ మోసపూరిత యాప్స్ ద్వారా కాంటాక్ట్స్, ఫోటోలు సేకరించి వేధింపులకు గురిచేసే ప్రమాదం ఉంది. గుర్తుతెలియని లోన్ యాప్‌లను డౌన్లోడ్ చేయరాదు.
* ఇంపర్సనేషన్ ఫ్రాడ్ (Impersonation Fraud): బ్యాంక్ అధికారులు, పోలీసులమని బెదిరిస్తూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.
* ఆన్లైన్ షాపింగ్ మోసాలు (Online Shopping Fraud): భారీ డిస్కౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వెబ్సైట్ల లింకులను నమ్మి ముందుగానే నగదు చెల్లించి మోసపోవద్దు.
వెంటనే ఫిర్యాదు చేయండి:
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా అధికారిక పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని సీపీ సూచించారు.
సైబర్ క్రైమ్ రహిత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టౌన్ ఇన్స్పెక్టర్లు, సైబర్ విభాగం ఎస్సైలు అనూష, సిబ్బంది ఎస్ ఆర్ జూనియర్ ప్రయివేట్ కళాశాల జోనల్ ఇంచార్జి తిరుపతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

