కలం, నిర్మల్ : పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు (TGSRTC Union Elections) జరుగుతుండటంతో కార్మిక సంఘాల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆరు డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మిక శాఖ నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,773 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నిర్మల్, భైంసా, ఉట్నూర్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో రెండు సంఘాల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంఘాల నేతలు కార్మికులను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారం సాగుతోంది. బుధవారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తూ సంఘాల నేతలు ప్రచారం నిర్వహించారు. జేఏసీ నేత గంగాధర్ గౌడ్‌తో పాటు కార్మిక సంఘాల నాయకులు నిచ్చెన, బస్సు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మరోవైపు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత వేణుగోపాల చారి మహాకూటమి బాణం గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను కోరుతూ ప్రచారం నిర్వహించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. తమ సంఘానికి గుర్తింపు దక్కించుకునేందుకు ఇరు వర్గాలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండటంతో కార్మికుల్లో ఎన్నికల సందడి నెలకొంది.

