కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశమని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ (Surendra Mohan) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సర్ ప్రక్రియ పై రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ముందుగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల ఈఆర్ఓలు ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై అబ్జర్వర్‌కు వివరించారు. ఇప్పటి వరకు జారీ చేసిన నోటీసులు, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, నిర్వహించిన హియరింగ్‌లు, మృతులు, వలస వెళ్లిన ఓటర్లు, 2002 నాటి ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని కేసులు, ఇతర అనామలీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలెక్టోరల్ రోల్ పరిశీలకులు, సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, ఆయా పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల (బి. ఎల్. ఎ) వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా, క్షేత్రస్థాయిలో ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది అనే అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు, బి.ఎల్.ఎ లు అధికారులకు సహకరించాలని కోరారు. దీనిపై స్పందిస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా యంత్రాంగం, సర్ ప్రక్రియను సవ్యంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నారని , ఎలాంటి ఇబ్బంది లేదని, సర్‌లో భాగస్వాములైన జిల్లా కలెక్టర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మొదలుకొని కిందిస్థాయి బూత్ లెవెల్ అధికారుల వరకు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. అయితే పట్టణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ సిబ్బందిని కూడా ప్రక్రియలో భాగస్వామ్యులను చేయాలని అన్నారు.
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా తయారు చేయాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని, ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో ఉండాలని, అలాగే అర్హత లేని వారు జాబితాలో ఉండకూడదని, ఈ విషయంలో అధికారులతో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి పని చేస్తే సాధ్యమవుతుందని అన్నారు. పెండింగ్ నోటీసులు జారీ పూర్తి చేయాలని , నిర్దేశిత గడువు లోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. నోటీసులు, హియరింగ్ ప్రక్రియ నిర్దేశిత గడువు కు ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్ ప్రక్రియలో జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సమావేశంలో వారు దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు.
సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు, నియోజకవర్గాలు, ఈఅర్ఓలు , ఎఈఆర్ఓలు, బిఎల్ఓ, బిఎల్ఏ నియామకం, సర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని వివరాలన్నింటినీ వివరించారు. జిల్లాలో రేషనలైజేషన్ తర్వాత 862 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి పోలింగ్ కేంద్రానికి బిఎల్ఓ ను నియమించడం జరిగిందని, అలాగే 2316 మంది బి.ఎల్.ఎ లు ఉన్నారని , 732488 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 103086 మంది చనిపోయిన, గుర్తించలేని, డబుల్ ఓటర్లు పోగా ఆగస్టు 17 న ముసాయిదా జాబితా ప్రకారం 629402 మంది నమోదయ్యారని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లలో అక్షర దోషాలు, చిరునామా, వయసు తదితర విషయాలలో తేడాలున్న 236590 మంది ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని, విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గం ఈఆర్ఓ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బి హరిప్రియ, డి.ఆర్.ఓ ఎ.నిర్మల, ఆర్. డి.ఓ నవీన్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, ఎ.ఈ. ఆర్. ఓ లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

