జ‌డ్చ‌ర్ల ప్ర‌భుత్వ కాలేజీలో మెడికల్ కోడింగ్ వ‌ర్క్‌షాప్‌

కలం, జడ్చర్ల: జడ్చర్ల (Jadcherla)లోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో బుధవారం మెడికల్ కోడింగ్‌పై ఒకరోజు కార్యశాలను (Medical Coding Workshop) నిర్వహించారు. కళాశాల రసాయన శాస్త్ర విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (TSKC), థాట్‌ఫ్లోస్ మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సందర్భంగా కళాశాల, థాట్‌ఫ్లోస్ మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.వి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు మెడికల్ కోడింగ్ రంగం మంచి అవకాశాలను అందిస్తుందని తెలిపారు.

విద్యార్థులు విద్యతో పాటు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా పాలమూరు విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి డా.ఎస్. విజయలక్ష్మి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య బీమా వ్యవస్థలో మెడికల్ కోడింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. థాట్‌ఫ్లోస్ మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థకు చెందిన శిక్షకులు మొహమ్మద్ అఖిబ్ అయాన్, ప్రియాంక, మౌనిక విద్యార్థులకు శిక్షణ అందించారు. మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవల ఆదాయ నిర్వహణ విధానం, వైద్య రికార్డుల నిర్వహణ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.

అలాగే వైద్య సమాచారాన్ని సంకేతాల రూపంలో ఎలా నమోదు చేస్తారో శిక్షకులు వివరించారు. మెడికల్ కోడింగ్‌లో వ్యాధుల కోడింగ్, వైద్య విధానాల కోడింగ్, ఆరోగ్య సేవల కోడింగ్ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ రంగంలో తగిన శిక్షణ పొంది, వృత్తిపరమైన మెడికల్ కోడింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమానికి రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. రుకియాభాను నాయకత్వం వహించారు. TSKC సమన్వయకర్త జె. విక్రమ్ కుమార్, TSKC మెంటార్ వీర ప్రతాప్, అధ్యాపకులు డా. మాధురి, సతీష్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రజినీ, భార్గవితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>