కలం, మెదక్ బ్యూరో : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును(24-Hours Free Power) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి (Gavvalapalli) చౌరస్తాలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, జిల్లా నాయకుడు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, నాయకులు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో మెదక్–చేగుంట మార్గంలో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎస్ఐ శివానందం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ శాఖ ఏడీ మోహన్ బాబు, ఏఈ దినాకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు రాగానే రైతులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అయ్యా.. మీ కాళ్లు మొక్కుతాం, మా పంటలు ఎండిపోకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందించండి” అని వేడుకుంటూ అధికారుల కాళ్లపై పడ్డారు. రైతుల దీనస్థితిని గమనించిన ఏడీ మోహన్ బాబు సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో సంతృప్తి చెందిన రైతులు ధర్నా, రాస్తారోకోను విరమించారు.

