కలం, హనుమకొండ: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అరెస్టును నిరసిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన (Congress Protest) తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగరాజు (MLA KR Nagaraju) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఓట్ల అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని నాగరాజు అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ఆయనను పదవి నుంచి తొలగించడంతో పాటు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, డీసీసీ, బ్లాక్, మండల, డివిజన్ అధ్యక్షులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : అజిత్ అగార్కర్‌కు గౌతమ్ గంభీర్ వీడ్కోలు
Follow Us On : WhatsApp

