కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆయనకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ వీడ్కోలు పలికారు. అగార్కర్ పదవీకాలంలో భారత్ సాధించిన విజయాలను కొనియాడారు. అగార్కర్ నాయకత్వంలో జట్టు ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని గంభీర్ తెలిపారు. ఆయన హయాంలో భారత్ ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిందని గుర్తుచేశారు. చరిత్ర ఎప్పుడూ అగార్కర్ వైపే నిలుస్తుందని గంభీర్ వ్యాఖ్యానించారు.
అగార్కర్ 2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 4తో ఆయన పదవీకాలం అధికారికంగా పూర్తయింది. పొడిగింపును వద్దనుకోవడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆయన హయాంలో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

