వరంగల్‌లో గుడిసెల కూల్చివేత.. వినయ్‌భాస్కర్‌ అరెస్ట్‌కు యత్నం!

కలం, వరంగల్‌: వరంగల్‌ భద్రకాళీ ఆలయ (Bhadrakali Temple) పరిధిలోని చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం ఉదయం మట్టెవాడ పోలీసులు, కుడా అధికారులు గుడిసెలను తొలగించగా.. బాధితులు తీవ్రంగా ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను కూల్చి తమనే అరెస్టు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలో ఓ కాలనీ వాసి గాయపడినట్లు తెలిపారు. కొందరు బాధితులు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై బాధితులకు మద్దతుగా మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ (Dasyam Vinay Bhaskar) అక్కడికి చేరుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే హౌస్‌ అరెస్టులో ఉన్న తనను అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చే రాజ్యమా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ఆరోపించారు. మార్పు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని, బాగు చేసే ప్రభుత్వం వస్తుందని చెప్పి బుల్డోజర్‌ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పేదల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను కేసులు, అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. అయినా పేదల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

గతంలో చెరబండరాజు కాలనీ వాసులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి కలెక్టర్‌ను కలిసి తమ ఇళ్లను కాపాడాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, బుధవారం ఉదయమే గుడిసెలను కూల్చివేశారని తెలిపారు.‘‘మా ఇల్లు మాకు ఇవ్వండి.. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రకాళీ ఆలయ (Bhadrakali Temple) అభివృద్ధికి గతంలో రూ.30 కోట్ల నిధులు ఇచ్చామని, ఆలయ అభివృద్ధికి తాము సహకరిస్తామని, అయితే పేదలకు న్యాయం చేయాలని వినయ్‌భాస్కర్‌ కోరారు. ‘‘అభివృద్ధి చేయండి.. కానీ పేదలకు అన్యాయం చేయొద్దు’’ అని సూచించారు.

Also Read : సినిమా స్టైల్‌లో దొంగతనం.. ఏకంగా ఏటీఎంనే లాక్కెళ్లిన దొంగలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>