కలం, కరీంనగర్ బ్యూరో: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికే అప్పగించే మిల్లింగ్ వ్యవస్థపై కరీంనగర్ జిల్లా యంత్రాంగం నిఘా పెంచింది. ముఖ్యంగా సన్న రకం (గ్రేడ్-ఎ) ధాన్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు, రకం మార్పిడి నిబంధనలు దుర్వినియోగమవుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల విభాగం కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 34 రైస్ మిల్లుల (Karimnagar Rice Mills) నుంచి సన్నబియ్యం సేకరణ, డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సదరు మిల్లుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సన్నబియ్యం కన్సైన్మెంట్లను స్వీకరించవద్దని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను స్పష్టంగా ఆదేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతుల నుంచి భారీగా సన్న రకం (గ్రేడ్-ఎ) ధాన్యాన్ని సేకరించింది. అయితే నిబంధనలకు లోబడి పౌరసరఫరాల శాఖ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం ఈ గ్రేడ్-ఎ ధాన్యాన్ని కామన్ రకంగా మార్చుకునే వెసులుబాటును మిల్లర్లకు కల్పించారు. ఈ మార్పిడి ప్రక్రియ పూర్తి నిబంధనలతో కూడుకున్నది. గ్రేడ్-ఎ ధాన్యాన్ని కామన్ రకంగా మార్చాల్సి వస్తే ఆ రెండింటి మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని.. అంటే క్వింటాలుకు రూ.34.21 చొప్పున మిల్లర్లు రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు విధిగా చెల్లించాలి.
అయితే ప్రభుత్వం కల్పించిన ఈ మార్పిడి వెసులుబాటును ఆసరాగా చేసుకుని, చెల్లింపులు చేయకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా సన్నబియ్యం స్థానంలో నాసిరకం లేదా కామన్ బియ్యాన్ని అప్పగించేందుకు యత్నాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం అసలు ఏ రకం ధాన్యం నుంచి వచ్చింది? మిల్లింగ్ ప్రమాణాలు పాటిస్తున్నారా? వ్యత్యాస నిధులు జమ చేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో జిల్లా యంత్రాంగం రక్షణాత్మక చర్యలకు ఉపక్రమించింది.
34 మిల్లులపై బ్రేక్..
సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాల విభాగం) ఎఫ్‌సీఐకి లేఖ రాస్తూ సదరు 34 మిల్లుల నుంచి సరఫరాలను నిలిపివేశారు. జమ్మికుంట, కొత్తపల్లి, హుజూరాబాద్, మానకొండూర్, కేశవపట్నం, ఇల్లంతకుంట, గోడిశాల, రేణికుంట తదితర కీలక కేంద్రాల్లో ఉన్న ప్రధాన రైస్ మిల్లులు ఈ నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అయితే ఈ చర్యను నేర నిర్ధారణగా కాకుండా, ప్రభుత్వ ధాన్యానికి రక్షణగా వేసిన ప్రాథమిక ‘రెడ్ సిగ్నల్’గా చూడాల్సి ఉంది. సాధారణంగా బియ్యం గోదాములకు చేరిన తర్వాత నాణ్యతను తనిఖీ చేసే పద్ధతి స్థానంలో.. ముందు నిబంధనల ధృవీకరణ.. ఆ తర్వాతే డెలివరీ అనే కఠిన వైఖరిని అదికారులు అమలులోకి తెచ్చారు.
అయితే ఈ నిబంధన కేవలం కరీంనగర్‌లోని 34 మిల్లులకు (Karimnagar Rice Mills) మాత్రమే పరిమితమైనవి కావు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ధాన్యం మిల్లింగ్, రవాణా వ్యవస్థ మొత్తానికి ఇది వర్తిస్తుంది. తదుపరి రికార్డుల తనిఖీల్లో ఏవైనా అవకతవకలు నిర్ధారణ అయితే కఠినమైన క్రిమినల్, రికవరీ చర్యలు తీసుకుంటారు. 34 మిల్లులు.. 1.08 లక్షల క్వింటాళ్ల ధాన్యం.. క్వింటాలుకు రూ. 34.21 వ్యత్యాసం.. ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతున్న ఈ విచారణ అంతిమంగా ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగిస్తుందా లేదా అన్నది రాబోయే పౌరసరఫరాల శాఖ తనిఖీ నివేదికలతో తేలనుంది.
Also Read : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)

