కలం, మెదక్ బ్యూరో: బీఆర్‌ఎస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందా? రానున్న సిద్దిపేట పురపాలక ఎన్నికలను (Siddipet Municipal Elections) లక్ష్యంగా చేసుకుని హరీశ్‌రావును రాజకీయంగా కట్టడి చేయాలని భావిస్తోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు సిద్దిపేట బలమైన రాజకీయ స్థావరంగా ఉంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట పురపాలక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మెజారిటీ వార్డులను గెలిచి పురపాలక సంఘాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే స్థానిక నేతలతోపాటు మైనంపల్లి హన్మంతరావు కూడా సిద్దిపేటపై దృష్టి సారించారు. సొంత నిధులతో బోర్లు వేయించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానికంగా కాంగ్రెస్‌లోని గ్రూపు విభేదాలను అధిగమించి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. వార్డు స్థాయిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది. బీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను తమవైపు ఆకర్షించి పోటీని పెంచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం పర్యటనపై ఆశలు
సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా తర్వాత సిద్దిపేటలో సీఎం బహిరంగ సభ, పర్యటన ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు స్థానికంగా మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నాయి. అభివృద్ధికి హమీ ఇవ్వడంతో పాటు, ప్రజా పాలనలో అమలు అవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. బీఅర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్న వివిధ వర్గాలను గుర్తించి వారిని కాంగ్రెస్ అనుకూలంగా మార్చేలా చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.
వచ్చే వారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి సిద్దిపేట ఇన్‌చార్జిగా మంత్రి పొంగులేటి నియామకం అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అభివృద్ధి హామీలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, వివిధ వర్గాలను తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నేతలపై దృష్టి
హరీశ్‌రావు చుట్టూ కొందరు నేతలదే ఆధిపత్యం కొనసాగుతోందన్న అసంతృప్తి బీఆర్‌ఎస్‌లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తాము రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారనే భావన కొందరిలో ఉందని పేర్కొంటున్నాయి. దీనికి తోడు సిద్దిపేటలో గల్లీగల్లీకి బీఆర్‌ఎస్ నాయకులు ఉండటంతో పార్టీకి క్యాడర్ ఓవర్‌లోడ్ సమస్యగా మారింది. దీంతో టికెట్ల కోసం ఆ పార్టీలో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్ దక్కని బలమైన నేతలను తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌తో సంప్రదింపుల్లో ఉన్నారని సిద్దిపేట కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
హరీశ్‌రావు ఇమేజ్..
మరోవైపు బీఆర్‌ఎస్ వ్యూహాలు కూడా మొదలయ్యాయి. హరీశ్‌రావు తన రాజకీయ పట్టును నిలబెట్టుకునేందుకు క్యాడర్‌ను సమీకరిస్తున్నారు. ఇప్పటికే హరీశ్‌రావు క్షేత్రస్థాయి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎక్కువ సమయం సిద్దిపేటలోనే ఉంటూ క్యాడర్‌తో మాట్లాడుతున్నట్లు తెలిసింది. పైగా ఎప్పుడూ లేనివిధంగా హరీశ్‌రావు తొలిసారి గణేష్ మండలాలకు చందాలు, ఇతర విరాళలు, వ్యక్తిగత ఆర్థిక సహాయాలు చేస్తున్నారని స్థానిక లీడర్లు చెప్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పట్టణ అభివృద్ధి పనులు, బలమైన క్యాడర్, క్షేత్రస్థాయి నెట్‌వర్క్ ఆ పార్టీకి అదనపు బలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే టికెట్ల కేటాయింపు హరీశ్‌రావుకు సవాలుగా మారే అవకాశం ఉందని, టికెట్ దక్కని నేతలను పార్టీలోనే కొనసాగించడం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. సర్ ప్రక్రియలో సిద్దిపేటలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ఆ ప్రభావం కూడా మున్సిపల్ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సిద్దిపేటలో పట్టు నిలబెట్టుకునేందుకు హరీశ్‌రావు వ్యూహాలు, బీఆర్‌ఎస్ కంచుకోటలో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు.. రానున్న పురపాలక ఎన్నికలను ఆసక్తికరంగా మార్చనున్నాయి.

