కలం, నేషనల్ డెస్క్: ఫ్రాన్స్ (France) దేశంలో హై స్కూల్ విద్యార్థుల నిరసనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మంగళవారం జరిగిన ఆందోళనల్లో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ చేయి కోల్పోవాల్సి వచ్చింది. పాఠశాలల్లో సరిగ్గా మౌలిక వసతులు లేకపోవడం, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం, పాఠశాల విద్యా శాఖకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు దేశాన్ని చుట్టేశాయి. వీరికి అన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవో సంఘాలు మద్దతు తెలపడంతో మరింత తీవ్రతరమయ్యాయి.
పారిస్ ముట్టడి ఉద్రిక్తం..
రాజధాని పారిస్ నగరాన్ని ముట్టడించేందుకు దేశం నలువైపులా సుమారు 86 వేల మంది విద్యార్థులు చేరుకున్నారు. దీంతో వీరిని నిలువరించడం పోలీస్ అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో లాఠీఛార్జి చేసి విద్యార్థులను చెదరగొట్టారు. అంతేగాకుండా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. సుమారు 5 వేల మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకోగా.. 200 మంది వరకు గాయపడినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. తమకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళనలు విరమించబోమని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. వీలైనన్ని ఎక్కువ పాఠశాలలు స్థాపించడం, సరిపడా టీచర్లను నియమించడం, విద్యా వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మెక్రాన్‌కు తలనొప్పి తప్పదా..?
విద్యార్థుల ఆందోళనలు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది. 2027 ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతుందగా.. ఆరు నెలల ముందు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఎటు దారి తీస్తాయోనన్న కలవరం మెక్రాన్ పార్టీలో నెలకొంది. ఇప్పటికే మెక్రాన్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు నెలకొనడం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన భవితవ్యం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. విద్యార్థుల ఆందోళనలు అన్ని వర్గాలకు విస్తరిస్తే.. మెక్రాన్‌కు అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీత తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి.

