కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే వానాకాలం 2026-27 ధాన్యం కొనుగోలు (Khammam Paddy Procurement) సీజన్ ప్రారంభానికి ఖమ్మం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న ధాన్యాన్ని సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించేందుకు వీలుగా, ధాన్యం రకాల గుర్తింపు, ధృవీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాలను పక్కాగా గుర్తించి, ప్రభుత్వం అందించే బోనస్ ప్రయోజనం కేవలం అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సక్రమంగా అందేలా ఈ నిఘా, తనిఖీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం రకాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగిన కనీసం ఒక ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. బీఎస్సీ (అగ్రికల్చర్) / డిప్లొమా (అగ్రికల్చర్) విద్యార్హత కలిగిన వ్యక్తులను మాత్రమే ఈ విధులకు ఎంపిక చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగస్వాములై విధులు నిర్వహించే అర్హత కలిగిన సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పారితోషికం చెల్లిస్తారు.
కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారు లను కలవాలని కోరారు. ఇక్కడ నియామకమైన సిబ్బంది కొనుగోలు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ, సన్న ధాన్యం రకాల గుర్తింపు మరియు ధృవీకరణ ప్రక్రియలో కీలక భాగస్వాములవుతారని జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటనలో వివరించారు.

