మహిళా సాధికారత, క్రీడల ప్రోత్సాహమే లక్ష్యం: జారే ఆదినారాయణ

కలం, ​చండ్రుగొండ: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వృత్తి నైపుణ్య శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (Jare Adinarayana) అన్నారు. మంగళవారం చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి చెందిన మహిళలు ‘ది మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే ఆదినారాయణ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఇంటి వద్ద నుంచే టైలరింగ్ పనులు చేపట్టి ఆదాయం పొందవచ్చని సూచించారు. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని తెలిపారు. సర్టిఫికెట్లు అందుకున్న మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రస్థాయి అండర్–20 కబడ్డీ పోటీలు!

​అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఇండోర్‌ మైదానంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్–20 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.​

పోటీల నిర్వహణ నిమిత్తం జిల్లా TPCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులకు ఎమ్మెల్యే స్వయంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వేదిక కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు, ప్రజలు సహకరించి పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>