కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ , పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవన, వైద్య ఆరోగ్యం, విద్య, మార్కెటింగ్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, క్రీడలు, యువజన సర్వీసులు తదితర శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని శాఖల వారీగా సమీక్షించారు.
పథకాల అమలు, పనుల పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలపై అధికారులను ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పీఎం సూర్య ఘర్ బిజిలీ యోజన పథకం ద్వారా ఇంటి పైకప్పులపై సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. సర్పంచ్‌లు ముందుకు వచ్చే గ్రామాల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ (MP DK Aruna) కోరారు.
అమృత్ పథకం పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలి :
మున్సిపాలిటీల్లో అమృత్ పథకం ద్వారా చేపడుతున్న తాగునీటి సరఫరా పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సంబంధిత ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించి పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు, మహిళా సంఘాలకు డ్రోన్ల ద్వారా పంటలకు పురుగుమందుల పిచికారీపై అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వైవిధ్యమైన పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, డీఆర్‌డీఓ నర్సింహులు, జడ్పీ సీఈఓ వెంకట రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, దిశ కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

