కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామ్యానికి ప్రజల ఓటే అసలైన బలమని, భవిష్యత్తును నిర్ణయించే శక్తి అని అన్నారు. అలాంటి ఓటు హక్కుపై అనుమానాలు కలిగే పరిస్థితులు ఏర్పడితే ప్రజాస్వామ్యవాదులు మౌనంగా ఉండరని సంజీవ్ ముదిరాజ్ స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నాయని డీసీసీ చీఫ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి పారదర్శకత ఎందుకు కనిపించడం లేదని సంజీవ్ ముదిరాజ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. అన్యాయంగా ఓటు హక్కు కోల్పోయిన అర్హులైన ప్రతి పౌరుడి ఓటును పునరుద్ధరించాలని అని సంజీవ్ (Sanjeev Mudiraj) డిమాండ్ చేశారు.
ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్న పోరాటం కాదని, దేశంలోని ప్రతి ఓటరు హక్కు కోసం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీపీసీసీ అధికార ప్రతినిధి అక్తర్, డీసీసీ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి, వేముల కృష్ణయ్య, మినాజుద్దీన్, రాములు యాదవ్, సాయి బాబా, ఎం ఏ. కలీమ్, వెంకటయ్య, అజ్మత్ అలీ, పాసుల రాజు, నాయకలు, తదితరులు పాల్గొన్నారు.

