కలం, నిర్మల్ : తెలంగాణ రాష్ట్రం అవినీతి, భూకుంభకోణాలకు (Telangana Land Scam) అడ్డాగా మారిందని, అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిషేధిత భూముల వ్యవహారంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై అసెంబ్లీలో బీజేపీ పక్షాన గళం విప్పినట్లు తెలిపారు. 22 -ఏ జాబితాలోని భూముల అంశంపై తాము నిరంతరం పోరాడుతున్నామని, అసెంబ్లీ సాక్షిగా పలు వాస్తవాలను ప్రజల ముందుంచామని (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22 -ఏ జాబితాలో ఉన్న భూముల్లో ప్రస్తుతం ఎన్ని భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించబడ్డాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములు ఆ జాబితాలోకి చేరాయి అనే పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. నిషేధిత భూముల పూర్తి జాబితాను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే రెండు పార్టీల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరస్పరం ఆస్తులు, అవినీతి అంశాలపై విమర్శలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన అంశాలు పూర్తి వ్యవహారంలో కొంత భాగమేనని అన్నారు. లక్షల ఎకరాల భూములను 22 -ఏ పేరుతో నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో భారీ విలువైన భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న బినామీ కంపెనీల ద్వారా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇప్పటికే ప్రభుత్వ భూములను కాజేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపైనా కన్నేశారని విమర్శించారు. ఈ నెల 10న హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ భూకుంభకోణాలు, అవినీతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడిస్తామని తెలిపారు బీజేపీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేపడతామని పేర్కొన్నారు.

