కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా జట్టుకు నాయకత్వం వహించిన ఆమె కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పింది. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంది. కెప్టెన్‌గా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాననే భావనకు వచ్చానని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ఇక కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకోలేదని ఆమె వెల్లడించింది. కెప్టెన్సీ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు ఉన్నాయని తెలిపింది.
జట్టు కోసం తన వ్యక్తిగత ఆట, ఎదుగుదల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. అవన్నీ జట్టును మెరుగుపరచడం, ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడమే లక్ష్యంగా ఉన్నాయని వివరించింది. 2016లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్ పదేళ్ల పాటు ఆ బాధ్యతలో కొనసాగింది. 2022లో వన్డే కెప్టెన్‌గా మారింది. 2023లో మూడు ఫార్మాట్లకు నాయకురాలైంది.
ఆమె కెప్టెన్సీలో భారత్ గత నవంబర్‌లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండో ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కూడా సాధించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు కాదని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేసింది. జట్టు భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. ఇక నుంచి కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా మైదానంలో కొనసాగనుంది. కెప్టెన్సీ ముగిసినా.. భారత క్రికెట్‌పై తన ప్రేమ మాత్రం కొనసాగుతుందని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.

