కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పీఏసీఎస్ పాలకవర్గాల నామినేటెడ్ పదవుల (PACS Nominated Posts)వ్యవహారం కొత్త పంచాయితీకి దారితీస్తోంది. సహకార సంఘాల పాలకవర్గాల్లో తమ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించలేదంటూ పలువురు సీనియర్ నేతలు, ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి కొన్ని పేర్లను ప్రతిపాదించి పార్టీ అధిష్ఠానానికి పంపిన నేపథ్యంలో జాబితాలో తమ వర్గానికి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కలేదంటూ మరో వర్గం పీసీసీ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌లలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీ కానుండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పేర్ల ప్రతిపాదనతో మొదలైన పంచాయితీ..
నిర్మల్ జిల్లాలోని సహకార సంఘాల పాలకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నాయకులు, సీనియర్లతో చర్చించి కొన్ని పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన మండల స్థాయి నాయకులు, సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీ అధిష్ఠానం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం.
దీంతో పలుచోట్ల మండల పార్టీ నాయకులు, కన్వీనర్లు, సీనియర్ కార్యకర్తల పేర్లను వివిధ పదవులకు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే ప్రతిపాదిత జాబితాల్లో తమ వర్గానికి చెందిన నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కలేదని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి ఐకే రెడ్డి వర్గంలో అసంతృప్తి
నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వర్గానికి చెందిన నేతల పేర్లు ప్రతిపాదనల్లో తక్కువగా ఉండటంపై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ముధోల్‌లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గానికి, ఖానాపూర్ లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ వర్గానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయా వర్గాల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న తమ పరిస్థితి ఏమిటని కొందరు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతో పీఏసీఎస్ పదవుల వ్యవహారం క్రమంగా అంతర్గత రాజకీయ అంశంగా మారుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పీసీసీకి చేరిన పంచాయితీ
తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న కొందరు నేతలు ఈ వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతిపాదించిన పేర్లే తుది జాబితా కాదని, పార్టీ అధిష్ఠానం అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందని పార్టీ నాయకత్వం చెబుతున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రతిపాదిత పేర్లను ఖరారు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, పదవులు ఇంకా ఫైనల్ కాలేదని పార్టీ ముఖ్య నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు తుది జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని నాయకులు చెబుతున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో వివిధ వర్గాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు మరోసారి బయటకు వస్తున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆశావహులు కోరుతున్నారు. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ముఖ్య నాయకులతో చర్చించి పీఏసీఎస్ పాలకవర్గాల పదవులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

