కలం, ఖమ్మం బ్యూరో: పరిశుభ్రతకు కేరాఫ్ గా.. నాణ్యతో కూడిన వంటలకు వేదికగా ఖమ్మం జిల్లా మధిర (Madhira) సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిలుస్తోంది. ఇది ఏర్పాటై రెండు నెలలు పూర్తి అయింది. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు, వారి శారీరక, మానసిక వికాసానికి దోహదపడే లక్ష్యంతో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్’ లో భాగంగా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను గత జులై 27న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా ఉంది.
మధిర టౌన్ తో పాటు11 మండలాల్లోని 575 ప్రభుత్వ పాఠశాలలు,10 జూనియర్ కళాశాలల్లోని సుమారు 27,700 మంది విద్యార్థులకు రోజూ రుచికరమైన, పరిశుభ్రమైన పోషకాహారం అందిస్తోంది. ఉదయం వేడివేడి ఆహారం అందుతుండటంతో విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతుల్లో కూర్చోవాల్సిన అవసరం తప్పిందని, ఫలితంగా ఏకాగ్రత, పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది.
టిఫిన్ తయారీ ఇలా..
సెంట్రలైజ్డ్ కిచెన్ లో అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ఎక్కడా చేయి తగలకుండా వంటకం పూర్తి కావడం ఇక్కడి ప్రత్యేకత. గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2,000 దోశలు తయారు చేయగల భారీ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మెషీన్లను వినియోగిస్తున్నారు. 70 మంది వర్కర్లు మూడు షిఫ్టుల్లో శ్రమిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 11 గంటలకే 35 మంది వర్కర్లతో మొదటి షిఫ్ట్ ప్రారంభమవుతుంది. పాత్రలు, మెషినరీస్ ను రెండుసార్లు శుభ్రం చేసుకుని, స్టీమ్ మెషీన్ల ద్వారా ఉదయం 4 గంటల్లోపు అల్పాహారాన్ని సిద్ధం చేస్తారు. దాన్ని ప్యాక్ చేసి 32 ప్రత్యేక వాహనాల్లో మధిర చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలకు సకాలంలో చేరవేస్తారు.
స్థానిక రైతులకు ఉపాధి
ఆ తర్వాతి షిఫ్టుల్లో సిబ్బంది మరుసటి రోజుకు కావలసిన కూరగాయలు సిద్ధం చేయడం, వెజిటబుల్స్ కట్ చేయడం, పిండి కలుపుకోవడం, హౌస్ కీపింగ్ పనులు పూర్తి చేస్తారు. మొత్తం ప్రక్రియను సజావుగా నడిపేందుకు 5 మందితో డిస్ట్రిబ్యూషన్ టీమ్, 4 మందితో ప్రొడక్షన్ టీమ్, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ఆపరేషనల్ మేనేజర్, డీజీఎం పర్యవేక్షిస్తుంటారు. ఆహార పదార్థాలు గమ్యస్థానానికి చేరే వరకు వేడిగా, నాణ్యంగా ఉండేలా క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక కిచెన్‌కు కావలసిన కూరగాయలను స్థానిక రైతుల నుంచి వెండర్ ద్వారా సేకరిస్తుండగా వారికి ఉపాధి లభిస్తోంది.
ఎన్ఐఎన్ సంస్థ ప్రత్యేక మెనూ
విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాలు అందేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలో ప్రత్యేక మెనూను రూపొందించారు. వారంలో రోజుకో అల్పాహారంతో పాటు రోజు విడిచి రోజు వేడి పాలను అందిస్తున్నారు. తొలిరోజు ఇడ్లీ, సాంబార్, రెండో రోజు పూరి, ఆలు కుర్మా, మూడో రోజు దోశ, చట్నీ, నాలుగో రోజు ఉప్మా, చట్నీ, ఐదో రోజు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, ఆరో రోజు బోండా, చట్నీ అందిస్తున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి ప్రభుత్వం అల్పాహార వ్యయాన్ని భరిస్తోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు రూ. 11.50, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ. 13.50, పాలు అందించే రోజున రూ. 1.08 చొప్పున అదనపు కేటాయింపులు చేస్తోంది. కిచెన్ నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆర్థిక సాయం అందించింది.
కిచెన్ సక్సెస్‌తో మరో రెండు చోట్ల
మధిర సెంట్రలైడ్స్ కిచెన్ విజయంతో ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో మరో రెండు సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. కిచెన్ల నిర్మాణానికి జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 5.17 కోట్లు), జైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 4 కోట్లు) ఆర్థికసాయానికి ముందుకు వచ్చాయి. మొత్తంగా రూ. 9.17 కోట్ల విరాళం అందించాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. వచ్చే నవంబర్ 30 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కిచెన్లను ఒకేసారి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, సెంట్రలైజ్డ్ కిచెన్లను నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతిని రికార్డు చేస్తూ క్యాలరీలను లెక్కించేందుకు అధునాతన యాప్‌లను వినియోగించాలని సూచించారు. ప్రాంతీయ ఆహార అలవాట్లకు అనుగుణంగా, అత్యున్నత నాణ్యతతో ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

