కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ (Telangana Congress)లో ఏం జరుగుతున్నది? సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు పొసగడం లేదా? తలో దారి తరహాలో వ్యవహరిస్తున్నారా? ఇద్దరి మాటల్లో పొంతన ఎందుకు ఉండడం లేదు?.. ఇదీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్న చర్చ. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లాగా పని చేయాలంటూ నేతలు ప్రకటిస్తున్నా.. ఆచరణలో మాత్రం ఎవరికి వారే అనే తీరులో కామెంట్స్ చేయడం కాంగ్రెస్ శ్రేణులను కన్‌ఫ్యూజన్‌లోకి నెడుతున్నది. బీసీ కులగణన చేసిన తొలి, ఏకైక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణలోనే బీసీ వర్సెస్ రెడ్డి చర్చ మొదలుకావడం చర్చనీయాంశమైంది.
‘2034 వరకూ నేనే సీఎం’ అంటూ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆయా సందర్భాల్లో ఆయనపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ‘నెక్స్ట్ సీఎం బీసీనే’ అంటూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించడంతో సరికొత్త వివాదానికి తావిచ్చినట్లయింది. దీనికి తోడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట అంటున్నానని ఆయన పేర్కొనడంతో సీఎం, పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ పెరిగిందనే అనుమానాలకు బలం చేకూరినట్లయింది.
ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల్లా ఉండాలని.. సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ తరచూ చెప్పే మాట. ఇంతకాలం కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ సైతం దీన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇంకోవైపు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తరచూ ఫోన్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సారథ్యంలోనే 2028 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
పైకి ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నప్పటికీ, లోలోపల ఏదో జరుగుతున్నదని.. సీఎం, పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ పార్టీలో జరుగుతున్నది. తాజాగా ఓబీసీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్ చేసిన ‘బీసీ సీఎం’ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మరో పదేళ్లు నేనే సీఎం..’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గతంలో కొండా సురేఖ ఖండించారు. ఎవరు సీఎంగా ఉండాలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ సైతం అదే తరహాలో కామెంట్లు చేయడం చర్చకు తావిచ్చింది.
2034 వరకూ నేనే సీఎం: రేవంత్ రెడ్డి
పదేళ్లు తానే సీఎం అని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “కేసీఆర్.. నీ గుండెలపై రాసి పెట్టుకో.. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు” అని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో గతేడాది జులై 18న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది జూన్‌లో ఓ ప్రైవేట్ మీడియా సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. “2034 వరకు నేనే ముఖ్యమంత్రి.. 2034 తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండను.. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా.. నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా..” అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జులై 30న ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో మాట్లాడే సందర్భంగా “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను… దీనిపై ఎవరూ ఎలాంటి అనుమానాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు..” అని వ్యాఖ్యానించారు.
బీసీ సీఎం ఖాయం: పీసీసీ చీఫ్
తెలంగాణకు త్వరలోనే బీసీ బిడ్డ సీఎం కావడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. “తొందర్లోనే బీసీ వ్యక్తి సీఎం అవుతారు.. రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట చెప్తున్నా.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తారు..” అని ఈ నెల 4న శంషాబాద్‌లో జరిగిన ఓబీసీ బహిరంగ సభలో పేర్కొన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని, అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. బీసీల హక్కుల కోసం కొట్లాడే, మాట్లాడే ధైర్యాన్ని రాహుల్‌గాంధీ ఇచ్చారని అన్నారు.
“ఏదో ఒక రోజు తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారు. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కానీ ఈ ఐదేళ్లూ రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు” అని గతేడాది ఫిబ్రవరి 18న గాంధీభవన్‌లో జరిగిన ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గతేడాది ఆగస్టు 9న “బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. సీఎం రేవంత్‌తో మంచి అనుబంధమే ఉంది.. విభేదాలున్నట్లు జరుగుతున్న ప్రచారం తప్పు” అని అన్నారు. గత నెల 15న సీఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా.. ‘‘సీఎంకు, నాకు వేవ్‌లెంగ్త్ సరిగ్గా సరిపోయింది.. మా మధ్య ఎలాంటి విభేదాల్లేవ్… అభిప్రాయ భేదాలు వచ్చినా అదే రోజు సాయంత్రానికి పరిష్కరించుకుంటాం..” అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌కు రాజకీయ అస్త్రం
గత కొంతకాలంగా కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వస్తున్నదని, ఇప్పుడది వ్యతిరేకత స్థాయికి చేరుకున్నదని బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పీఆర్సీ, డీఏలు, జాబ్ నోటిఫికేషన్లు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, సాగునీరు, తాగునీరు, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా అనేక అంశాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు తదితర వర్గాల్లో అసంతృప్తి ఉన్నదని పేర్కొంటున్నది.
ఇంకోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆయన కుటుంబ సభ్యుల, సన్నిహితుల ఆస్తులు, ఈ రెండున్నరేండ్లలో పెరిగిన ఆదాయం, వ్యాపార లావాదేవీలను డాక్యుమెంట్లు, ఫ్లెక్సీల రూపంలో ప్రజల్లో ఎక్స్‌పోజ్ చేస్తున్నది. మరోవైపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలే కారణమని ఆరోపిస్తున్నది. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ చేసిన ‘బీసీ సీఎం’ కామెంట్లు బీఆర్ఎస్‌కు రాజకీయ అస్త్రంగా మారినట్లయింది.

