3 రాష్ట్రాల్లో 150 మోసాలు.. సైబర్ నేరగాడి అరెస్ట్

కలం, ఆదిలాబాద్: బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్లు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణం మొదటి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దాదాపు 150 సైబర్ మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. 150 మంది బాధితుల నుంచి మొత్తం రూ.95.33 లక్షల మేర నగదు మోసం చేసినట్లు వివరించారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన చైతన్య ప్రమోద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకులో పనిచేసిన అనుభవంతో..

ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన ప్రఫుల్ పాటిల్‌కు ఈ ఏడాది జులై 23న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంటూ నిందితుడు ఫోన్ చేశాడు. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో బాధితుడిని నమ్మించి ఓటీపీలను తెలుసుకున్నాడు. అనంతరం ఐదు లావాదేవీల ద్వారా రూ.73,279 బదిలీ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లభించిన సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు గతంలో ఆక్సిస్ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో కస్టమర్లతో మాట్లాడిన అనుభవాన్ని ఉపయోగించుకున్నట్లు వెల్లడించాడు.

సిమ్, ఫోన్లు మార్చుతూ..

బ్యాంక్ కస్టమర్ల మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేసేవాడని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కస్టమర్ల క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఓటీపీలను తెలుసుకుని డబ్బులను వివిధ యూపీఐ, అమెజాన్ ఖాతాలకు బదిలీ చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. వివిధ మొబైల్ నంబర్లతో సిమ్ కార్డులు, ఫోన్లు మార్చుతూ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

మోసాలకు ఉపయోగించిన ఓ మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా నిందితుడు తెలిపినట్లు వెల్లడించారు. సైబర్ మోసాలకు గురైన ప్రజలు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఓటీపీ, పిన్, సీవీవీ, కార్డు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ఎస్పీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>