కలం, మెదక్ బ్యూరో: రహదారుల అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరం. ఈ రెండింటినీ మేళవిస్తూ మెదక్ (Medak) జిల్లాలో వినూత్నమైన ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా ఒక జాతీయ రహదారి పొడవునా పచ్చదనంతో పాటు ఆర్థిక ఫలాలను ఇచ్చే సుమారు 35 వేల జీడిమామిడి మొక్కలను (Cashew Trees) నాటే భారీ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
43 కి.మీ. మేర 35 వేల మొక్కలు
పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు జీడిమామిడి పెంపకంతో రెట్టింపు ప్రయోజనాలను కల్గించడమే లక్ష్యంగా మెదక్ నుండి NH-765DG జాతీయ రహదారి వెంట రామాయంపేట పట్టణం నుంచి సిద్దిపేట శివారు బూర్గపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డుకు ఇరువైపుల వేలాది జీడిమామిడి మొక్కలను పెంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 43 కిలో మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది జీడిమామిడి మొక్కలు నాటడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాధారణంగా రహదారుల పక్కన నీడనిచ్చే, పూల మొక్కలను నాటుతుంటారు. కానీ ఉత్పాదకత కలిగిన జీడిమామిడి చెట్లను ఇంత భారీ స్థాయిలో నాటడం ద్వారా బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. జీడిమామిడికి తక్కువ నీటి అవసరం ఉంటుంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ, పొడి నేలల్లోనూ ఇవి త్వరితగతిన పెరుగుతాయి. నిర్వహణ కుడా సులభతరంగా ఉటుంది. జాతీయ రహదారుల పక్కన ఖాళీగా ఉండే భూముల్లో కేవలం పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా “ఆదాయ వనరుగాష మార్చేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడునుంది. ఈ 35 వేల చెట్ల నుంచి వచ్చే జీడిపప్పు దిగుబడి ద్వారా స్థానికంగా ఎంతో మేలు జరగనుంది. జాతీయ రహదారి వెంట పచ్చదనాన్ని పెంపొందిస్తూనే, ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు, రహదారుల నిర్వహణ సంస్థలకు ఒక ఆదర్శవంతమైన మోడల్‌గా నిలవనుంది.
సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో రోడ్డు పక్కన మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఒకప్పడు ఈ రోడ్డులో వేలాది మొక్కలు ఉండేవని ,రోడ్డు విస్తరణ కారణంగా ప్రసుత్తం ప్రయాణికులకు నీడ కూడా లేని పరిస్ధితి ఉందని చెప్పారు. ఈ రహదారి వెంబడి వేలాది మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ జీడి మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల DFO, పోలీస్, రెవెన్యూ, DEO, DPO సహకారంతో వేలాది మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. ప్రజలందరు పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 6న సాయంత్రం రామాయంపేటలోని అమోఘ్ హోటల్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ మొక్కల పెంపకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారి ఒకే రోజున, ఒకే తరహా వేలాది మొక్కలు నాటే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

