కలం, వెబ్ డెస్క్: లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటన్ విమానం (British Airways) ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తుండగా ఎమర్జెన్సీ సిగ్నల్ పంపించింది. ‘ఎమర్జెన్సీ కోడ్ 7700’ ప్రసారం చేయడంతో ఒక్కసారిగా రెండు దేశాల్లో కలకలం రేపింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA295 పేరు ఉన్న ఫ్లైట్ ఐర్లాండ్ గగనతలం మీద 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. ఒక్కసారిగా 9 వేల అడుగులకు జారి పోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ‘ఎమర్జెన్సీ కోడ్ 7700’ అనేది అత్యవసర సహాయం కోసం ఏటీసీకి పంపించే కోడ్. అత్యవసర పరిస్థితి ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు.
ఇంకా ల్యాండ్ కాని విమానం..
ప్రస్తుతం విమానం ఇంకా ఐర్లాండ్ గగనతలం మీద ఉందని, ఎక్కడా ల్యాండ్ కాలేదని తెలుస్తోంది. కోడ్ 7700 అనేది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పైలట్లు జారీ చేస్తుంటారు. ఒకవేళ ఫ్లైట్ హైజాకింగ్‌కు గురైతే కోడ్ 7500 జారీ చేస్తుంటారు. బ్రిటన్ విమానం ప్రస్తుతానికి కోడ్ 7700 ఇవ్వడంతో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా.. అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏటీసీ వర్గాలు పైలట్లతో నిరంతరం టచ్‌లో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

