కలం, కరీంనగర్ బ్యూరో: గడ్డం వెంకట్ స్వామి (Gaddam Venkatswamy) సేవలు, స్ఫూర్తి, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ చిరస్మరణీయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట్ స్వామి (కాకా) జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఇతర ముఖ్య నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలు స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లక్షలాది మంది ఈ ప్రపంచంలో జన్మిస్తారని, కానీ కొంతమంది మాత్రమే తమ జీవితంతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. అలాంటి మహనీయుల్లో వెంకట్ స్వామి ఒకరని తెలిపారు. నీతికి, న్యాయానికి కట్టుబడి, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు వెంకట్ స్వామి అని కొనియాడారు.
ఆయనతో కలిసి రాజకీయంగా పనిచేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో కాకా తనకు ఎన్నో సందర్భాల్లో మార్గదర్శకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలి, ప్రజల సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, పేద ప్రజలకు ఎలా అండగా నిలవాలి అనే విషయాల్లో ఆయన ఇచ్చిన సూచనలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా దాన్ని తన ఆపదగా భావించి స్పందించే గొప్ప మనసున్న వ్యక్తి కాకా వెంకట్ స్వామి అని ప్రశంసించారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక జీవితంలో కూడా ఆయన ఆలోచనా విధానం, సేవా భావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
తెలంగాణ సాధన ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఆకాంక్ష..
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ కోసం పోరాటం ఎలా ఉండాలి, ప్రజలను ఎలా చైతన్యపరచాలి, రాజకీయంగా అన్ని వర్గాలను ఎలా ఒప్పించాలి అనే విషయాల్లో ఆయన తమకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కాకా ఆశయాలకు అనుగుణంగా నేడు ఆయన కుటుంబం కూడా ప్రజా సేవలో కొనసాగడం ఎంతో సంతోషకరమన్నారు.
ఒక కుమారుడు మంత్రిగా, మరో కుమారుడు ఎమ్మెల్యేగా, మనవడు ఎంపీగా ప్రజలకు సేవ చేయడం ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయనడానికి నిదర్శనమన్నారు. కాకా వెంకట్ స్వామి ఆలోచనా విధానాన్ని, సేవా స్ఫూర్తిని ఆయన అనుచరులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు న్యాయం చేయడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం ద్వారా మాత్రమే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని పొన్నం స్పష్టం చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలు తరతరాలకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

