కలం, నేషనల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. భారత్ తన అణు రక్షణ వ్యవస్థను (India Nuclear) నిరంతరం ఆధునికీకరిస్తూ, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ‘బులిటెన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్’ (బీఏఎస్) తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 190 అణు వార్హెడ్‌లు (అణు బాంబులు) సిద్ధంగా ఉన్నట్లు అంచనా. శత్రుదేశాల నుంచి ఎదురయ్యే అణు ముప్పును ఎదుర్కొనేందుకు గగనతలం, భూతలం, జలతలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించగల పూర్తిస్థాయి ‘న్యూక్లియర్ ట్రయాడ్’ సామర్థ్యం భారత్ సొంతం చేసుకున్నదని ఈ నివేదిక స్పష్టం చేసింది.
అగ్ని కుటుంబమే వెన్నెముక..
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘అగ్ని’ క్షిపణి వ్యవస్థ దేశ వ్యూహాత్మక రక్షణలో కీలకంగా మారింది. ప్రస్తుత సైనిక అవసరాల కోసం పృథ్వీ-2తోపాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 వంటి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యాధునిక ఖండాంతర క్షిపణి అగ్ని-5 అత్యంత కీలకం. సుమారు 6,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించే అగ్ని-5.. పాకిస్థాన్, చైనాలను దాటి మధ్య ఆసియా, రష్యా, యూరప్లోని పలు ప్రాంతాల వరకూ లక్ష్యాలను చేరుకోగలదు. అగ్ని-5లోని ‘ఎంఐఆర్వీ’ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్స్) సాంకేతికత మరో ప్రత్యేకత.
అగ్ని-5 ద్వారా ఒకే క్షిపణిలోని వార్హెడ్లను విడదీసి.. ఒక్కొక్కదాన్ని వేర్వేరు లక్ష్యాల వైపు మళ్లించవచ్చు. అంటే ఒకే క్షిపణితో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం అన్నమాట. దీనికి తోడు కేనిస్టర్ డిజైన్ వల్ల క్షిపణిని ముందుగానే సిద్ధంగా ఉంచి, అవసరమైనప్పుడు తక్కువ సమయంలోనే ప్రయోగించవచ్చు.
సముద్రగర్భంలోనూ అణు అస్త్రాలు
సముద్రగర్భంలోనూ భారత్ తన అణు సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచుకున్నది. ఇప్పటికే సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాట్ జలాంతర్గాములతో పాటు.. ఐఎన్‌ఎస్ అరిధామన్ అనే మూడో అణు సబ్మెరైన్ నౌకాదళంలో చేరినట్లు ఈ నివేదిక తెలిపింది. అణు శక్తితో నడిచే ఈ జలాంతర్గాములు శత్రువుల కంటపడకుండా సముద్రంలో సుదీర్ఘకాలం దాగి ఉండగలవు. తద్వారా భారత్పై తొలి అణు దాడి జరిగిన వెంటనే.. సముద్రం నుంచి ప్రతిదాడి చేసే ‘సెకండ్ స్ట్రైక్’ సామర్థ్యం నిరంతరం అందుబాటులో ఉన్నది.
మిరాజ్-2000 నంబర్ వన్..
భారత్ అణు సామర్థ్యంలో వాయుసేన యుద్ధవిమానాలు కూడా కీలక బలంగా మారాయి. ఫ్రాన్స్ నుంచి సేకరించిన మిరాజ్-2000 ప్రస్తుతం ప్రధాన పాత్రను నిర్వహిస్తుండగా.. బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జాగ్వార్ యుద్ధవిమానాలు ద్వితీయ అణు పాత్రలో ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. పాతబడుతున్న జాగ్వార్ల స్థానాన్ని భవిష్యత్తులో రఫెల్ విమానాలు భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. వీటికి తోడుగా సుఖోయ్-30 ఎంకేఐ, రఫెల్ వంటి అధునాతన యుద్ధవిమానాలు గగనతలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యంలో భాగంగా ఉన్నాయి.
నో ఫస్ట్ యూజ్.. ఎప్పటికీ రహస్యమే!
ఇంతటి విస్తృత అణు సన్నద్ధత ఉన్నప్పటికీ.. భారత్ తన దీర్ఘకాలిక అణు విధానమైన ‘నో ఫస్ట్ యూజ్’ (ముందుగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంపై అణు దాడులు జరిగితే అత్యంత కఠినంగా స్పందించే వ్యూహంతోనే ఈ వ్యవస్థలను ఆధునికీకరిస్తున్నదని పేర్కొన్నది. అయితే, మన దగ్గరున్న అణ్వాయుధాల అసలు సామర్థ్యం ఎంత? క్షిపణులు కచ్చితంగా ఎంత దూరం వరకు దూసుకెళ్లగలవు? అనే వివరాలను ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. అందువల్ల ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని ఈ నివేదిక స్పష్టం చేసింది.
అణు బలం.. ఎవరి దగ్గరెంత?
అణ్వాయుధాల సంఖ్యలో అమెరికా, రష్యాలదే ఆధిపత్యం. రష్యా వద్ద సుమారు 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్హెడ్‌లు ఉన్నట్లు అంచనా. ఆ తర్వాతి స్థానంలో చైనా సుమారు 620 వార్హెడ్లు ఉన్నట్లు సమాచారం. ఫ్రాన్స్ (370), బ్రిటన్ (225) తర్వాత భారత్ 190 అణు వార్హెడ్లతో ముందువరుసలో ఉన్నది. పాకిస్థాన్ వద్ద సుమారు 170 వార్హెడ్‌లు ఉన్నాయి. అయితే, అణు సామర్థ్యాన్ని కేవలం వార్హెడ్ల సంఖ్యతోనే అంచనా వేయలేం. క్షిపణుల పరిధి, అణు జలాంతర్గాములు, గగనతలం నుంచి ప్రయోగించే సామర్థ్యం, వార్హెడ్లను మోసుకెళ్లే వ్యవస్థలు వంటి అంశాలు కూడా కీలకమే.

