కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూసిన ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (Telangana EHIS) అమల్లోకి వచ్చి నాలుగు నెలలు దాటినా.. కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం మాత్రం సజావుగా సాగడం లేదు. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలకు 1.5 శాతం చొప్పున చందా వసూలు చేస్తుండగా.. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తోంది. దీంతో నెలకు రూ.88 కోట్ల నిధి సమకూరుతోంది. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా ట్రస్టుకు చేరాయి. అయినా ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో చికిత్సకు కొన్ని చోట్ల నిరాకరణ ఎదురవుతున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
ఈహెచ్ఐఎస్ అమలును పర్యవేక్షించేందుకు సీఎస్ అధ్యక్షతన 30 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. సమస్యల పరిష్కారంపై ఇప్పటికే 25 సార్లు సమావేశమైన బోర్డు.. సోమవారం మరోసారి భేటీ కానుంది. రూ.10 లక్షలకుపైగా ఖర్చయ్యే 30 చికిత్స కేసులతోపాటు పథకం అమలులోని సమస్యలపై చర్చించనుంది.
7.56 లక్షల హెల్త్‌కార్డులు డౌన్లోడ్
గత నెలాఖరుకు 12,56,962 మంది లబ్ధిదారులకు హెల్త్‌కార్డులు అందుబాటులోకి రాగా.. 7,56,210 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటివరకు 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల మేర అనుమతులు లభించాయి. ఇన్‌పేషెంట్ సేవలకు 1,816 సీజీహెచ్ఎస్ ప్యాకేజీలు అమల్లో ఉండగా.. మందులు, పరీక్షలు, ఇంప్లాంట్లు తదితర సేవలు కూడా ఇందులోనే ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ లేకుండానే ఎంప్యానెల్డ్ ఆస్పత్రిలో చేరే అవకాశం కూడా కల్పించారు.
అయితే జాబితాలో ఉన్న కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు వివిధ కారణాలతో ఈహెచ్ఐఎస్ కింద చికిత్సకు నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో చందాలు చెల్లిస్తున్నా.. అవసరమైన సమయంలో క్యాష్‌లెస్ వైద్యం అందుతుందా? అన్న సందేహం లబ్ధిదారుల్లో నెలకొంది. సమస్యల పరిష్కారానికి 30 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తుండగా.. మరో 25 కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
20 ఏళ్ల డిమాండ్ నెరవేరింది
‘‘ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మా ఇరవై ఏళ్ల డిమాండ్. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి జీవో జారీ అయింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమల్లోకి వచ్చినా.. ఆస్పత్రులకు బిల్లులు బకాయి పడటంతో సమస్యలు తలెత్తాయి. ఉద్యోగుల నుంచి కూడా కంట్రిబ్యూషన్ తీసుకుంటామన్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత స్కీమ్ ప్రారంభంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో సమస్యలు క్రమంగా తొలగుతున్నాయి. బోర్డు ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యలను పరిష్కరిస్తోంది’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
70 శాతం కొలిక్కి వచ్చింది
‘‘కిమ్స్, యశోదా ఆస్పత్రులకు ఎక్కువ మంది ఉద్యోగులు వెళ్తుండటంతో పడకల కొరత కొంత ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ సమస్య ఎదురవుతోంది. దీనిని అధిగమించేందుకు ట్రస్ట్ బోర్డు చర్యలు ప్రారంభించింది. పాత బకాయిల కారణంగా కొన్ని ఆస్పత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఉన్న రూ.170 కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ.70 కోట్లు ట్రస్ట్ ద్వారా చెల్లించాం. కొత్త స్కీమ్ దాదాపు 70 శాతం కొలిక్కి వచ్చింది. మిగిలిన 30 శాతం సమస్యలు కూడా రానున్న రోజుల్లో పరిష్కారమవుతాయి’’ అని జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు.
పారదర్శకత పెంచాలి
‘‘ఈ స్కీమ్‌ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. వ్యాధుల కవరేజీపై మరింత దృష్టి పెట్టాలి. అనవసర కారణాలతో పేషంట్లను ఇతర ఆస్పత్రులకు మళ్లించకుండా చూడాలి. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. ఆస్పత్రుల జాబితా సహా అన్ని అంశాల్లో పారదర్శకత పెంచితే సమస్యలు మరింత తగ్గుతాయి’’ అని టీఎన్జీవోస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్నారు.

