SIR అక్రమాలపై కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ.. నేడు కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై భవిష్యత్ పోరాట కార్యాచరణను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Meeting)  నేడు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కీలక భేటీ నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ ఛార్జ్‌లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.

ఓటర్ల జాబితా సవరణలో జరిగిన దొంగ ఓట్ల నమోదు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి భారీ మార్చ్ నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత మార్చ్‌ను విజయవంతం చేయడంతో పాటు, అన్ని రాష్ట్రాల్లోనూ ఈసీ వ్యతిరేక ఉద్యమాలను ఏ విధంగా ఉధృతం చేయాలనే దానిపై పీసీసీ అధ్యక్షులకు వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ సరళి, క్షేత్రస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను మహేష్ గౌడ్ అధిష్ఠానానికి తెలపనున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ భేటీ ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>