కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ కాలనీ కుమ్మరి బజార్ ప్రాంతంలో నివసించే కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలుడు సోమవరపు గగన్ ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. దగ్గర్లోనే నిర్మాణంలో ఉన్న నీటి సంపు వద్దకు వెళ్లిన చిన్నారి, ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.
కళ్లముందే ఉత్సాహంగా ఆడుకున్న కొడుకు ఒక్కసారిగా కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరకు నిర్మాణంలో ఉన్న సంపులో బాలుడు విగతజీవిగా తేలియాడటం చూసి గుండెలవిసేలా విలపించారు. కళ్ల ముందే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

