కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Yadagirigutta Temple) పేరుతో YTD, Yadadri, Yadagirigutta తదితర పేర్లతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు అనధికారిక వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. వీటి ద్వారా దర్శనం, సేవలు, పూజలు, వసతి, విరాళాలు, ఆన్లైన్ బుకింగ్ల పేరుతో భక్తులను మోసపూరిత లావాదేవీలకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
దేవస్థానం పేరును పోలి ఉన్న కొన్ని అనధికారిక వెబ్సైట్లను ఇప్పటికే గుర్తించి, సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులు దర్శనం, సేవలు, వసతి, పూజలు, విరాళాలు తదితర ఆన్లైన్ సేవల కోసం అధికారిక వెబ్సైట్ yadagiriguttatemple.telangana.gov.in ను మాత్రమే వినియోగించాలని సూచించారు.
అనుమానాస్పద లింకులు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి ఎలాంటి చెల్లింపులు చేయవద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద వెబ్సైట్లు, బుకింగ్లు లేదా లావాదేవీలు కనిపిస్తే వాటి వివరాలు, స్క్రీన్షాట్లు, లావాదేవీ ఆధారాలను వెంటనే దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. “అధికారిక వెబ్సైట్ను మాత్రమే నమ్మండి.. అనుమానాస్పద లింకులను నమ్మవద్దు.. నిర్ధారణ లేకుండా ఆన్లైన్ చెల్లింపులు చేయవద్దు” అని యాదగిరిగుట్ట దేవస్థానం (Yadagirigutta Temple) అధికారులకు భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Also Read : దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోండి.. మోదీకి కవిత రిక్వెస్ట్
Follow Us On: X(Twitter)

