కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం నియోజకవర్గంలో పాలన, రాజకీయ వ్యవహారాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి జోక్యం పెరుగుతుండటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం అతిక్రమించి తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ప్రాబల్యం, జోక్యం పెరిగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
శనివారం ఖమ్మంలో ‘మీట్ ది ప్రెస్’ సమావేశంలో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఒక్క కొత్తగూడెం సీటును మాత్రమే కేటాయించిందని కూనంనేని గుర్తుచేశారు. అయినా కూటమి విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ ఏకంగా 118 నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా త్యాగం చేసిందన్నారు. దాన్ని గుర్తించకుండా తమ ప్రాతినిధ్యానికి భంగం కలిగించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం పొత్తు ధర్మానికి పూర్తిగా విరుద్ధమని హెచ్చరించారు.
రెండు సీట్లు రెడ్డి వర్గానికేనా..?
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంత్ రావు కూడా కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. రాబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇద్దరు రెడ్లకే ప్రాధ్యానతనివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సమతుల్యత, మిత్రపక్షాల అభిప్రాయాలను విస్మరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి సరికాదని విమర్శించారు. కూనంనేని వ్యాఖ్యలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, మిత్రపక్షమైన సీపీఐ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

