కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నగరపాలక సంస్థ (Karimnagar Corporation) ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శనివారం మేయర్ కొలగాని శ్రీనివాస్ 3, 11, 29వ డివిజన్లలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
11వ డివిజన్ కట్టరాంపూర్‌లో..
మొదటగా 11వ డివిజన్ కట్టరాంపూర్‌లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సయ్యతో కలిసి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)కి చెందిన రూ. 3 లక్షల నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో..
మరో వైపు 3వ డివిజన్ తీగలగుట్టపల్లి ప్రాంతంలో గల మాణిక్యేశ్వరీ నగర్లో స్థానిక కార్పొరేటర్ సాదినేణి లావణ్య మునీంధర్తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ. 24.30 లక్షల సాధారణ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
29వ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్, మింగని వాడలలో..
29వ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్, మింగని వాడ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ సోమిడి వేణులతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ యూఐడీఎఫ్కు చెందిన రూ. 70 లక్షల నిధులతో రెండు చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం 28, 29వ డివిజన్లకు సంబంధించి ప్రజల మంచి నీటి సరఫరాకు హనుమాన్ దేవాలయం వద్ద 15వ ఆర్థిక సంఘానికి చెందిన రూ. 56.00 లక్షలతో మంచి నీటి పైప్‌లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
విలీన గ్రామాల అభివృద్ధే లక్ష్యం..
ఈ సందర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్ల అభివృద్దే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. కార్పొరేటర్లు, ప్రజలు తమ దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను దశల వారిగా పరిష్కరించననున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ల వారిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా.. ప్రాధాన్యతగా ఇప్పటికే యూఐడీఎఫ్ రూ. 50 కోట్ల నిధులను కేటాయించి పనులు ప్రారంభం చేసి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరో 30 కోట్లతో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు.
మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో నగరపాలక సంస్థ 66 డివిజన్ల అభివృద్ధి కోసం “అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ” పథకంలో చేర్చి రూ. 840 కోట్ల తీసుకురావడం జరిగిందని తెలిపారు. గడిచిన 8 నెలల మా పాలకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి భారీగా నిధులు తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా నగర అభివృద్ధి కోసం భారీగా నిధులు తెచ్చి, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి పనులను కూడ ప్రారంభం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
నగరంలోని కిసాన్, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ తదితర శివారు ప్రాంతాల్లో గతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా విలీనం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రాధాన్యత క్రమంలో దశల వారిగా అభివృద్ధి పనులు పూర్తి చేసి.. కరీంనగర్‌ను ఒక సుంధర నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది స్థానిక డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

