కలం, దిలావర్‌పూర్ : గ్రామీణ వైద్యుల సమస్యలను(Rural Doctors Issues) పరిష్కరించి, అర్హులైన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి అధికారిక గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. దిలావర్‌పూర్ (Dilawarpur) మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ నాయకులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందిస్తూ సేవలందిస్తున్నామని తెలిపారు. 2009లో జారీ చేసిన జీవో ప్రకారం శిక్షణ, గుర్తింపు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైన గ్రామీణ వైద్యులకు శిక్షణతోపాటు అధికారిక గుర్తింపు కల్పించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షుడు శివశరణ్, కార్యదర్శి ధనంజయ్, ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య, కన్న సాయన్న, రవి, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్, భూమేష్, సాయినాథ్, సురేందర్ రెడ్డి, సభ్యులు మురళి, సబ్జల్ అలీ, రమణారెడ్డి, అశోక్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

