కలం, స్పోర్ట్స్ : భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 శుక్రవారం రోజున ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పినప్పటికీ, వన్డేలు మరియు టీ20 ఫార్మాట్లలో మాత్రం ఆటను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్త్యాంప్టన్షైర్ తరఫున ఆడిన చాహల్, సెప్టెంబర్ 26న మిడిల్సెక్స్తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ పూర్తి చేశారు. ఆ మ్యాచ్‌లో ఆయన రెండు వికెట్లు పడగొట్టారు.
సుదీర్ఘ కాలం పాటు హర్యానా తరఫున, ఆ తర్వాత కౌంటీలో ఆడిన ఆయన తన 17 ఏళ్ల రెడ్ బాల్ ప్రయాణానికి ముగింపు పలికారు. తన నిర్ణయంపై స్పందిస్తూ చాహల్ భావోద్వేగానికి గురయ్యారు. తన పదేళ్ల వయసులో మొదటిసారి రెడ్ బాల్ పట్టుకున్నానని, ఈ ఫార్మాట్ తనకు ఓర్పును, పట్టుదలను నేర్పించిందని ఆయన పేర్కొన్నారు. టెస్టు క్యాప్ సాధించడం తన డ్రీమ్ అని, అది నెరవేరకపోయినా ఈ ప్రయాణం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని ఆయన (Yuzvendra Chahal) అన్నారు.
తనకు అండగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ కెరీర్లో చాహల్ 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 148 వికెట్లు పడగొట్టారు. అందులో ఆరు సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 152 పరిమిత ఓవర్ల మ్యాచుల్లో 217 వికెట్లు తీసిన చాహల్, 2024 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులోనూ భాగస్వామిగా ఉన్నారు. ఇంకా ఆట తనలో మిగిలే ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన, భారత జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయడానికి శ్రమిస్తానని స్పష్టం చేశారు.

