కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ నేతన్నలకు రావాల్సిన బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లను గుజరాత్ కంపెనీలకు ఎందుకు తరలించారని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ప్రశ్నించారు. నేతన్నల నోటికాడి కూడు లాక్కొని, ఆ కాంట్రాక్టులను గుజరాత్‌కు కట్టబెడుతూ సీఎం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. సంగారెడ్డి లో చింతా ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చేనేత సంక్షేమానికి కనీసం ఒక్క అడుగైనా వేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక వేల మంది పోలీసుల పహారా మధ్య సభలు నిర్వహించుకోవాల్సిన దుస్థితికి దిగజారిందని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతం సిరులతో విరజిల్లిందని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లు ఇలా ఏ కాంట్రాక్టు వచ్చినా సిరిసిల్ల మగ్గాలకే ప్రాధాన్యం దక్కేదన్నారు. కేసీఆర్ పాలనలో నేతన్నలకు చేతినిండా పని, కడుపునిండా తిండి లభించిందన్నారు. ఇప్పుడు ఆ మగ్గాలు ఎందుకు మూగబోయాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, రేవంత్ రెడ్డికి ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజలు బండకేసి కొట్టడం ఖాయమని చింతా (Chinta Prabhakar) జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు, ఏ నియోజకవర్గానికి వెళ్లినా చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా లేదని దుయ్యబట్టారు. కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం, బూతులు మాట్లాడడం, బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార వ్యాఖ్యలు చేయడం తప్ప ముఖ్యమంత్రిగా ఆయన సాధించిందేమీ లేదని చింత ప్రభాకర్ విమర్శించారు.

