కలం, వెబ్ డెస్క్: అహింస, సత్యాగ్రహం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మహాత్మా గాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ వేషధారణలో ఉన్న చిన్నారులు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను భట్టి పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గంలో అసమానతలు, వివక్ష, అవమానాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహాత్మ గాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకమని కొనియాడారు. అసమానతలు, వివక్ష, అవమానాలు లేని సమాజ నిర్మాణమే మహాత్ముడికి మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
గాంధీ స్ఫూర్తితోనే ప్రజా పాలన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. 1924లో బెల్గాంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనే తొలిసారిగా అంటరానితనానికి వ్యతిరేకంగా చరిత్రాత్మక తీర్మానం చేశారని గుర్తు చేశారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, శాంతి, అహింసా మార్గాలతో దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

