కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ (Karimnagar Municipal Corporation) కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగర ప్రథమ పౌరులు, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ అందించిన సేవలు ఆదర్శం అని కొనియాడారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది మంది భారతీయుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన గొప్ప మహనీయులని అన్నారు. సత్యం, అహింసలనే శక్తివంతమైన ఆయుధాలుగా మలుచుకుని, బ్రిటిష్ పాలనపై పోరాడి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
రైతుల హక్కుల కొసం చంపారన్ సత్యాగ్రహం, బ్రిటిష్ వస్తువులు, సంస్థల బహిష్కరణ కోసం సహాయ నిరాకరణ ఉద్యమం, బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్లాలని క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పు సత్యాగ్రహం దండి మార్చ్ లాంటి ఎన్నో పోరాటాలు నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. ప్రతి ఏటా గాంధీ జయంతిని అహింసా దినంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నేటితరం, భావితరం స్పూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఆయన చూపిన మార్గాలు కేవలం దేశానికే కాకుండా, ప్రపంచ రంగానికి ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవరచుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహార్, ఏఈ సతీష్, క్యాషియర్ వెంకటేష్, ఉద్యోగులు అఖిల్, రాకేష్, సతీష్, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

