భక్తుల పాలిట అమృతహస్తం.. యాదాద్రి అన్నప్రసాదం!

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్తుల పాలిట ఆపన్నహస్తంగా మారింది. ఆలయ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ప్రశాంతతతో పాటు నిత్యాన్నదానం (Yadadri Annadanam) సంతృప్తినిస్తోంది. నారసింహుని దర్శనానంతరం భక్తులకు రాజభోగాలను తలపించేలా రుచికరమైన అన్నప్రసాదాన్ని వైటీడీఏ అందిస్తోంది. కొండ కింద నిత్యాన్నదాన సత్రం నిత్యం భక్తులతో సందడిగా ఉంటూ.. ఆత్మీయ సేవలకు నిలయంగా మారింది. భక్తుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

సంప్రదాయ అరిటాకు భోజనం

యాదాద్రిలో భక్తులకు సంప్రదాయబద్ధంగా కూర్చోబెట్టి వడ్డించే విధానం పాటిస్తున్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో కూర్చొని భోజనం చేసేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరిటాకు భోజనం అందిస్తుండటంతో భక్తులు అమితా నందం వ్యక్తం చేస్తున్నారు. పులిహోర, వేడివేడి అన్నం, నాణ్యమైన, రుచికరమైన పప్పు, కూరలు, పచ్చడి, సాంబారు, మజ్జిగతో కూడిన సంపూర్ణ భోజనం భక్తులకు అందిస్తున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కుటుంబాలతో వచ్చే భక్తులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు నిత్యాన్నదాన కొండంత అండగా నిలుస్తోంది. కొండ దిగిన వెంటనే బయట ఎక్కడో తిండి కోసం వెతుక్కునే అవసరం లేకుండా అన్నప్రసాదం లభిస్తుండటంతో ఆలయ నిర్వహణపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాణ్యత, శుభ్రతకు గోల్డ్ స్టాండర్డ్

అన్నదానంలో ప్రధానంగా శుభ్రత, నాణ్యత విషయంలో ఆలయ అధికారులు, సిబ్బంది రాజీపడటం లేదు. భోజన పదార్థాల తయారీ వంటశాల నుంచి భక్తులు భోజనం చేసే విశాలమైన హాలు వరకు నిరంతరం శానిటేషన్ చర్యలు చేపడుతున్నారు. వడ్డింపులో కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. ఏ ఒక్కరికీ అసౌకర్యం కలగకుండా, పదార్థాల కొరత రాకుండా వేడివేడిగా సిద్ధం చేస్తూ నాణ్యతను కాపాడుతున్నారు.

మహా ప్రసాదం తయారీ వెనుక అనుభవజ్ఞులైన వంటస్వాములు ఉనరకొండ రామాచార్యులు, శేషబట్టర్ సంతోష్, ఆదిత్య, వెంకటరమణ, శ్రవణ్‌ల శ్రమ ఉంది. తమ చేతివంటతో ప్రసాదానికి ప్రత్యేకమైన రుచిని, శుచిని అందిస్తూ రోజూ వేలాది మంది భక్తుల ఆశీస్సులు అందుకుంటున్నారు. అన్నదాన సత్రం నిర్విరామంగా, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాగడానికి క్షేత్రస్థాయి అధికారులు నిత్యం శ్రమిస్తున్నారు. వైటీడీఏ అధికారుల పర్యవేక్షణలో పలువురు అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

స్వామి దివ్య దర్శనం ఎంతటి పవిత్రమైన అనుభూతిని ఇస్తుందో.. ఆ తర్వాత ఆత్మీయమైన వాతావరణంలో స్వీకరించే అన్నప్రసాదం కూడా భక్తులకు అంతే ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోంది. భక్తుల సంతృప్తే పరమావధిగా సాగుతున్న ఈ నిత్యాన్నదానం యాదాద్రి ఆలయ చరిత్రలోనే ఒక మహోన్నతమైన అధ్యాయంగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>