కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో (El Nino) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అటు రైతులకు సాగునీరు, ఇటు ప్రజలకు తాగునీటి సరఫరా సర్కార్‌కు సవాలుగా మారింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేకపోవడంతో వచ్చే వేసవికి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఆల్టర్నేట్ ప్లాన్ రూపొందించడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రంలో దాదాపు 38% వర్షపాత లోటు ఉండడంతో దాని ప్రభావం నుంచి గట్టెక్కడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యంగా మారింది.
సగం మండలాల్లో వర్షాలు లేకపోవడంతో వాటిని త్వరలోనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి కేంద్రం నుంచి సాయం కోరేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నది. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎల్ నినో ఎఫెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రభుత్వానికి పరీక్ష పెట్టనున్నది. ఇప్పటికే నగరంలో యావరేజ్‌గా రోజుకు 5 వేలకు పైగా ట్యాంకర్లను సరఫరా చేస్తున్న జలమండలికి ఫిబ్రవరి తర్వాత నుంచి అసలు పరీక్ష ఎదురుకానున్నది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు కూడా ఇబ్బందులు తప్పవని, ధరలు పెరిగి ప్రజలపై భారం తప్పదన్న ఆందోళన నెలకొన్నది.
యాసంగి సాగుపై ఆశల్లేవ్
వానాకాలం సాగు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎల్ నినో కారణంగా తగ్గింది. కొన్నిచోట్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఆశించిన మేర దిగుబడి రావడం గగనంగా మారింది. ఖరీఫ్‌లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రబీ(యాసంగి)లో మరింత దయనీయంగా మారుతుందనే అభిప్రాయాలూ వ్యవసాయ శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో సైతం వరి దిగుబడి తగ్గవచ్చని, కొనుగోలు కేంద్రాల ద్వారా సివిల్ సప్లయీస్ సేకరించే ధాన్యం కూడా తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఎల్ నినో కారణంగా ఖరీఫ్‌లోనే ఆరుతడి పంటలు వేయాలని చెప్పిన ప్రభుత్వం.. రబీ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వరి నాట్లు వద్దని అలర్ట్ చేసి ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఉదహరించే అవకాశమున్నది. ఎల్‌నినో కారణంగా భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితిని వివరించి రబీలో బోరుబావుల కింద సాగు చేసే పంటలపై ఆచితూచి అడుగేయాలని పిలుపునిచ్చే అవకాశమున్నది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చాలా బోరుబావుల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పూడికతీత (మట్టిని బయటకు తీయడం) పనులు మొదలయ్యాయి. గ్రౌండ్ వాటర్ సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతున్నది.
తాగునీళ్లే సవాల్
వచ్చే ఏడాది వేసవికి హైదరాబాద్ నగరానికి సమస్యల్లేకుండా తాగునీటిని సరఫరా చేయడం జలమండలికి అగ్నిపరీక్షగా మారింది. అందుకే పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈసారి వేసవిలో పెరిగిన వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఇప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నది. రోజుకు 5 వేలకు పైగా ట్యాంకర్ల సప్లై కంటిన్యూ అవుతున్నది. వేసవి నాటికి డిమాండ్ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని, అవసరాలకు తగినంత సప్లై ఉంటుందో లేదోననే ఆందోళన నెలకొన్నది. దీంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరలకు రెక్కలొచ్చే అవకాశాలు లేకపోలేదు.
రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటి నిల్వలు డిసెంబర్ వరకు సరిపోతాయని జలమండలి అధికారులు పేర్కొంటున్నా.. ఫిబ్రవరి వరకూ ఎల్ నినో ప్రభావం కొనసాగనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో అటు గ్రామాల్లో, ఇటు అర్బన్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ప్రభుత్వానికి సవాల్‌గా మారనున్నది. రిజర్వాయర్లలోని నీటి నిల్వలు తాగునీటి అవసరాలకేనంటూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర సాయం అనుమానమే!
ఎల్ నినో తీవ్రతపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో రివ్యూ నిర్వహించారు. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ఢిల్లీలో సమావేశమై రాబోయే రబీ సీజన్ ప్రణాళిక, రాష్ట్రాలకు చేయాల్సిన సూచనలపై చర్చించారు. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో దాదాపు సగం మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వ విభాగాలు తేల్చాయి. త్వరలో ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నది. ఆ తర్వాత ఆర్థిక సాయం కోసం కేంద్రానికి పంపనున్నది.
అయితే ఇప్పటికే విత్తనాల మొదలు పంట వరకు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకున్నందున కరువు మండలాలకు ఆర్థిక సాయం చేయడంపై ఏ మేరకు పాజిటివ్‌గా స్పందిస్తుందనే అనుమానాలు రాష్ట్ర అధికారుల్లో నెలకొన్నాయి. రాష్ట్రంలో సగటున వర్షపాత లోటు 38 శాతంగా ఉన్నా, కొన్ని మండలాల్లో గరిష్టంగా 70% మేర నమోదైంది. దీంతో ఒక్కో జిల్లాకు ఒక్కో తీరులో పంటల ప్రణాళికను, తాగునీటి సరఫరాను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు (టీఎంసీల్లో)
ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి కీలక జలాశయాల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులో గతేడాది 206.10 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం అది 87.45 టీఎంసీలకు పరిమితమైంది. అలాగే నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 295.70 టీఎంసీల నుంచి 181.52 టీఎంసీలకు క్షీణించింది. శ్రీరాంసాగర్ (46.36 టీఎంసీలు), లోయర్ మానేర్ (15.69 టీఎంసీలు), సింగూర్ (4.01 టీఎంసీలు) ప్రాజెక్టుల్లోనూ నీటి మట్టాలు గతేడాది కంటే తక్కువగా నమోదయ్యాయి. అయితే, నిజాంసాగర్ (12.08 టీఎంసీలు), ఎల్లంపల్లి (18.17 టీఎంసీలు) జలాశయాల్లో మాత్రం గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు స్వల్పంగా మెరుగ్గా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
కాగా, రాష్ట్రంలో గతేడాది ఆగస్టులో 37.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈసారి కేవలం 13.45 సెంటీమీటర్లకే పరిమితమైంది. సెప్టెంబర్‌లోనూ గతేడాది నమోదైన 26.77 సెంటీమీటర్లతో పోలిస్తే ఈ ఏడాది 14.17 సెంటీమీటర్లే కురిసింది. మొత్తంగా చూస్తే, గతేడాది నాలుగు నెలల్లో కలిపి 98.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది అది 61.55 సెంటీమీటర్లకే పరిమితమవ్వడంతో రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లోలు తగ్గి నీటి నిల్వలు పడిపోయాయి.
ప్రజల మీదే భారం
ఎల్ నినోతో ఎన్ని రకాల ఇబ్బందులున్నా, అంతిమంగా ఆ భారం ప్రజల మీదనే పడుతున్నది. ఇప్పటికే మార్కెట్‌లో బియ్యం రేటు అమాంతం పెరిగి, కిలోకు రూ.82 దాకా చేరుకున్నది. కరువు పరిస్థితులను అంచనా వేసిన ప్రైవేటు వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు వడ్లను కొంటున్నారు. రబీ సీజన్‌లో వరి దిగుబడి గణనీయంగా పడిపోతున్నందున వేసవి నాటికి బియ్యం ధర ఓపెన్ మార్కెట్‌లో కిలో వంద రూపాయలు దాటొచ్చని వ్యాపార వర్గాలు ముందుగానే ఎక్కువ ధరకు కొని నిల్వ చేసుకునే పనిలో పడ్డాయి.
తాగునీటి విషయంలోనూ ఇంకుడుగుంతల విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చివరకు ప్రజలకు శాపంగా మారుతున్నది. రిజర్వాయర్లలో నీళ్లు లేవనే కారణంతో ప్రభుత్వం నియంత్రణా చర్యలు మొదలుపెడితే, అవి సామాన్యులకు తిప్పలుగా మారనున్నాయి. అనివార్యంగా ప్రైవేటు నీటికి డిమాండ్ ఏర్పడి నెలవారీ కుటుంబ బడ్జెట్ పెరిగే ప్రమాదముంటుంది. ముంచుకొస్తున్న ముప్పును నివారించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఇప్పుడు ఆందోళన నెలకొన్నది.

