కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన నగదు బదిలీ, మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు, ఈ నెల 14న తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు.
వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ అధికారులు ఇప్పటికే పలువురు ప్రధాన నిందితులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నిందితుల నుంచి సేకరించిన కీలక సమాచారం, ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే సీబీఐ కూడా ఈ కేసులో విచారణ పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయగా, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

