కలం, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్ల ఎంపిక ఇంకా ఖరారు కాలేదని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) స్పష్టం చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు డిక్లేర్ అయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చైర్మన్ల విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అయితే కొందరు వ్యక్తులు చైర్మన్ల పేర్లు ఖరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రచారంపై పలువురు తనకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

