కలం, నిర్మల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అవసరమైన బడుల్లో అదనపు తరగతు గదుల నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిర్మాణం మరమ్మత్తులు, ఇతర నిర్మాణ, మరమ్మత్తుల పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ నాణ్యవంతంగా చేపట్టడంతో పాటు, వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఈడబ్ల్యుఐడీసీ డిప్యూటీ ఈఈ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

