కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని శ్రీ గణేశ్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం అధికారులు ఆకస్మిక దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో, ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన రూ. 58,904 విలువగల 6,368 ‘పీవాన్ స్పాస్ ప్లస్’ (ట్రామాడాల్) క్యాప్సూల్స్‌ను (Illegal Tramadol Sale) స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు..
ప్రిస్క్రిప్షన్ లేకుండా, విక్రయ బిల్లులు జారీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వీటిని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రామాడాల్ అనేది తీవ్రమైన నొప్పుల ఉపశమనానికి వాడే ఓపియాయిడ్ వర్గానికి చెందిన ఔషధం. ఇది మానసికంగా అలవాటుగా మారే స్వభావం కలిగి ఉండటంతో దీనిని షెడ్యూల్ హెచ్1 ఔషధాల జాబితాలో చేర్చారు. వైద్యుల ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే దీనిని విక్రయించాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా లేకుండా వాడితే తీవ్ర ముప్పు ఉంటుందని తెలిపారు.
ట్రామాడాల్ వాడితే..
ట్రామాడాల్ వాడకం మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది. డాక్టర్ సలహా లేకుండా, క్రమం తప్పకుండా లేదా పరిమితికి మించి వాడితే దీనికి త్వరగా అలవాటు పడిపోతారు. ఈ మందును హఠాత్తుగా ఆపేస్తే శరీరం వణకడం, తీవ్రమైన ఆందోళన, భరించలేని చెమటలు పట్టడం వంటి మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు ఇటువంటి మందులను సొంత వైద్యంగా వాడకూడదని, మెడికల్ షాపుల నిర్వాహకులు సైతం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

