కలం, కరీంనగర్ బ్యూరో: నారాయణపూర్ రిజర్వాయర్ (Narayanpur Reservoir) ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 100 శాతం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గ్రామస్తులు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రిజర్వాయర్ ప్రభావం, ముంపు పరిస్థితులు, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ఇటీవల నారాయణపూర్ గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, గంగాధర తహసీల్దార్ రజిత తదితర అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
గత కొద్దిరోజులుగా నారాయణపూర్ గ్రామస్తులు గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రౌండ్ లెవల్లో వాస్తవ పరిస్థితుల పరిశీలన
నారాయణపూర్ గ్రామంలో రిజర్వాయర్ ప్రభావం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కలెక్టర్ పరిశీలించారు. నారాయణపూర్ లో సుమారు 350 కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, భూసేకరణ, ముంపు ప్రభావం, సాగు భూములు, ఇళ్లు, హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. కార్యాలయాల్లో అందిన వివరాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రిజర్వాయర్ కారణంగా ఎంత మేరకు ప్రభావం ఏర్పడుతోంది, ఏ ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అంశాలను శాస్త్రీయంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. చర్లపల్లి, మంగపేట గ్రామాల్లో రిజర్వాయర్ ప్రభావం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
పది శాఖలతో ప్రత్యేక కమిటీ
నారాయణపూర్ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, భూగర్భ జలాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే తదితర శాఖల అధికారులు కమిటీలో భాగస్వాములు కానున్నారు.
ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు, భూసేకరణ వివరాలు, ముంపు ప్రభావం, భూముల పరిస్థితి, ప్రజలకు కలుగుతున్న నష్టం వంటి అంశాలన్నింటినీ కమిటీ పరిశీలిస్తుందని కలెక్టర్ చెప్పారు. గ్రామస్తుల నుంచి కూడా అవసరమైన వివరాలు సేకరించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని తెలిపారు.
ముంపు ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం
నారాయణపూర్ గ్రామం ఎంత మేరకు ముంపు ప్రభావానికి గురవుతుంది? ఎన్ని కుటుంబాలపై ప్రభావం పడుతుంది? సాగు భూములు, ఇళ్లు, ప్రజా వసతులకు కలిగే నష్టం ఎంత? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాక్షికంగా ముంపునకు గురయ్యే కుటుంబాల పరిస్థితులను కూడా కమిటీ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని చెప్పారు. గ్రామస్తులకు నష్టం కలగకుండా తగిన పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు.
అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి
భూసేకరణకు సంబంధించి గ్రామస్తులకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు లేదా సమస్యలు ఉంటే అధికారులకు రాతపూర్వకంగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి, అవసరమైన విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం న్యాయం చేస్తామని తెలిపారు.
రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు గ్రామస్తులు ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామస్తుల సహకారంతోనే వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించగలమని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
నారాయణపూర్ గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ముంపు ప్రభావం, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలు తదితర అన్ని అంశాలను సమతుల్యంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తామని చెప్పారు.
గ్రామస్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అపోహలను నమ్మవద్దని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామస్తులకు అండగా ఉంటుందని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కలెక్టర్ ఇచ్చారు.
మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ
నారాయణపూర్ రిజర్వాయర్ సమస్యను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలనే అంశాన్ని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నారాయణపూర్‌కు తీసుకువచ్చి గ్రామస్తుల సమస్యలను వివరించారు. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. ఇటీవల నారాయణపూర్ గ్రామస్తులతో ఎమ్మెల్యే సమక్షంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. నారాయణపూర్ గ్రామస్తులు శాంతియుత వాతావరణంలో జిల్లా యంత్రాంగానికి తమ సమస్యలను వివరించారు. గ్రామస్తుల సహకారంతో సమగ్ర పరిశీలన పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

