కలం, వెబ్డెస్క్: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తనదేనని పాలకూరి అశోక్ (Palakuri Ashok) ధీమా వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 వేల మొదటి ప్రాధాన్యత ఓటు 90 వేల రెండో ప్రాధాన్యత ఓటు సాధించి బీఆర్ఎస్ ఓడిపోవడానికి తానే కారణమయ్యానని చెప్పారు. 90 శాతం పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాదని కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి విమర్శించారు. బీఆర్ఎస్ సైతం ఓసీలకే టికెట్లు కేటాయించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అదే జరిగితే ఆ రెండు పార్టీలను, బీసీలు 100 శాతం బొంద పెట్టడం ఖాయమన్నారు. ఓట్లు మావి సీట్లు మీవా అని ప్రశ్నించారు.
బీసీలను నిండా ముంచారు
జన సంబంధం లేని వారు, తెలంగాణ అస్తిత్వం తెలియని వారు, డబ్బుల సంచులతో పోటీ చేయాలని చూస్తున్నారని అశోక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీలో కోర్టుల్లో నాటకలాడి బీసీలను నిండా ముంచిందన్నారు. ఇప్పుడు బీసీలకు సీట్లు కేటాయించడానికి అవకాశం ఉన్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 10% కూడా లేని ఓసీలు 70 శాతం అసెంబ్లీని కబ్జా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీని పాతంలోకి తొక్కుతారని విమర్శించారు.
నాన్ లోకల్ గో బ్యాక్ నినాదంతో ఉద్యమం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నాన్ లోకల్ కబ్జాలో ఉందని, పరిశ్రమలు, ఐటీ సెక్టార్, పెట్టుబడులు,ఉద్యోగాలు 80 శాతం ఇప్పటికే ఆంధ్రుల గుప్పెట్లో ఉన్నాయని వాపోయారు. శివసేన స్ఫూర్తితో నాన్ లోకల్ గో బ్యాక్ నినాదంతో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పన తన ఎన్నికల నినాదంని ప్రకటించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల ప్రకటన ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పవర్ సెక్టార్ లో 5300 ఉద్యోగాలతో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. 25 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించినా ఇప్పటివరకు దిక్కు లేదన్నారు.
సర్కారు బడిని బాగు చేస్తామని రేవంత్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదన్నారు. 33 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు. పేరుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ అస్తిత్వంను ఆంధ్రుల గుప్పెట్లో పెట్టారని విమర్శించారు. భౌగోళిక తెలంగాణ తప్ప సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, తెలంగాణ ఉన్నత కులాల చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ, బిసి వర్గాల్లో చైతన్యం ఓటు రూపంలో వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

