కేటీఆర్ విదేశీ ఆస్తులు స్వయంగా బయటపెట్టాలి: ఎంపీ చామల

కలం, భువనగిరి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) ఆస్తుల సంపాదన, విదేశీ పెట్టుబడులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాలో ఉండి కేటీఆర్ హోటల్స్ కొనుగోలు చేశానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమెరికాలో ఉండి 2006లో ఒక హోటల్ కొన్నానని, 2009 ఎన్నికల అఫిడవిట్‌లో మరో మూడు హోటల్స్ కొన్నానని కేటీఆర్ చెబుతున్నారని ఎంపీ చామల గుర్తుచేశారు. అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్నవారే సొంతంగా ఒక హోటల్, జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొనలేకపోతున్నారని.. అలాంటిది కేవలం ఆరేళ్లు అమెరికాలో ఉన్న కేటీఆర్ మూడు స్టార్ హోటల్స్ ఎలా కొన్నారని నిలదీశారు. కాళేశ్వరం, ఫార్ములా-ఈ కార్ రేస్ అవినీతి సొమ్ముతోనే తన తెలివితేటలను ఉపయోగించి ఆస్తులు పెంచుకున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌కు అమెరికా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్‌లలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆయనే స్వయంగా బయటపెడితే క్లారిటీ వస్తుందని, లేదంటే తాము ఆధారాలు బయటపెట్టాల్సి వస్తుందని చామ‌ల‌ హెచ్చరించారు. 2014లో మిగులు బడ్జెట్‌‌తో ఉన్న ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి 10 స్టార్ హోటల్స్ కట్టే సామర్థ్యం ఉన్న కేటీఆర్.. ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా ఉండి తెలంగాణను ఎందుకు ధనిక రాష్ట్రంగా నిలబెట్టలేకపోయారని ప్రశ్నించారు. ఒకసారి తనకు, తన తండ్రి కేసీఆర్‌కు ఉండటానికి ఇళ్లు లేవని చెప్పిన కేటీఆర్, మరోసారి తాము ఆగర్భ శ్రీమంతులమని అంటున్నారని, ఆయన మాటల్లో ఎక్కడా పొంతన లేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యంతో ఎన్నో హోటల్స్ మూతపడ్డాయని, రాష్ట్రం దివాళా తీసే స్థితికి వస్తే కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని నిలదీశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేటీఆర్ సహకారంతో అంబానీ, అదానీల పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతోనే కేటీఆర్‌కు గుండెల్లో దడ పుడుతోందని ఎంపీ చామల పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>