కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం (Yadagirigutta Municipality) వద్ద బీజేపీ కౌన్సిలర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. మున్సిపల్ జనరల్ బాడీ సమావేశాన్ని బహిష్కరించి, మున్సిపాలిటీలో జరుగుతున్న ఖర్చులు, బిల్లులపై సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలో కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియ లేకుండా పనులు అప్పగిస్తున్నారని, చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో ఏకపక్ష పాలన కొనసాగుతోందని విమర్శించారు. గత మూడు మున్సిపల్ సమావేశాల్లో చేసిన తీర్మానాలు, వాటి ఆధారంగా చెల్లించిన బిల్లుల వివరాలతో పాటు మున్సిపల్ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీలో జరుగుతున్న ఖర్చుల వివరాలను కోరినా ఇప్పటి వరకు పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. స్ట్రీట్ లైట్లు, మొక్కల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు, రిఫ్రెష్‌మెంట్స్, బతుకమ్మ వేడుకలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, జేసీబీలు, ట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులపై కూడా ప్రవీణ్ కుమార్ పలు ఆరోపణలు చేశారు. ఒక స్ట్రీట్ లైట్‌కు సాధారణంగా ఉండే ఖర్చు కంటే అధికంగా బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. శానిటేషన్ విభాగంలో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన పనులు, వాహనాల వినియోగం, కాంట్రాక్టులపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చిన నిధులను పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గంపై ఉందన్నారు.
మున్సిపల్ చైర్మన్ కుటుంబానికి సంబంధించిన వాహనాలు, జేసీబీలు, ట్రాక్టర్లకు చెల్లించినట్లు ఆరోపిస్తున్న బిల్లుల వివరాలను కూడా బహిర్గతం చేయాలని కోరారు. ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి కొనసాగితే పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే పరిస్థితి ఏర్పడుతుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోడ రాధ, కౌన్సిలర్ మాధవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెలిదే అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేష్, సురేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోడ బుచ్చిబాబు, శ్రీశైలం, అజయ్, దేవ, వినోద్, వంశీ, శ్రీనాథ్, నవీన్, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

