కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud ) నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రెండు అగ్రకులాలకు ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ అవకాశం ఇచ్చి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నిట్ట నిలువునా బొంద పెడుతుందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి రోల్డ్ మోడల్ గా నిలిచామని.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. త్వరలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సర్వోత్తమ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి లను ప్రకటించడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఇద్దరి రెడ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడ పొంతనలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్ణయంతో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాటలు నీటి మూటలని తేలిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ పునః పరిశీలన చేసి మంగళవారం ప్రకటించిన అభ్యర్థులను ఉపసంహరించుకొవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో జండా మోసిన బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయంగా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు
ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, రావులకోల్ నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నరసింహ నాయక్, గూడూరు భాస్కర్ మేరు, కొప్పుల చందు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

